వైసిపి సంక్షేమం… టిడిపి అభివృద్ధి మంత్రం : పట్టు కోసం టిడిపి, వైసిపి అభ్యర్ధుల ఎన్నికల ఎత్తులు

ప్రజాశక్తి – పొదిలి
ప్పస్తుత ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. సిద్దం అని వైసిపి అంటే సంసిద్ధం అంటూ టిడిపి ప్రచార అస్త్రాలు సంధిస్తున్నారు. వైసిపి సంక్షేమంపై ప్రచారం చేస్తుండగా టిడిపి, జనసేన మాత్రం రాష్ట్ర అభివృద్ధి, అధికార వైసిపి అవినీతి, అక్రమాలను ఎండగడుతుంది. వెనుకబడిన ప్రకాశం జిల్లాలో నేడు అభివృద్ధి, సంక్షేమం రెండు అంశాలు ప్రధాన అస్త్రాలుగా మారాయి. గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్న ఒంగోలు, కందుకూరు, మార్కాపురం రెవెన్యూ డివిజన్లను ప్రకాశం జిల్లాగా ఏర్పాటు చేసినప్పటికీ నేటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. ప్రకాశంలో సాగు, తాగు త్రాగునీటికి దోహదపడే శ్రీ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం దశాబ్దాలుగా ఇక్కడ ప్రజలను వెక్కిరిస్తోంది. 1996లో అప్పటి టిడిపి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవరకు ఈ ప్రాజెక్టు ప్రధాన పార్టీలకు ఓట్లు కురిపించేదిగా మారింది. 2004లో అధికారంకు వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టు పనులు పరిగెత్తించారు. 2009లో ఆయన మరణాంతరం పనులు నిలిచిపోయాయి. రాష్ట్ర విభజన అనంతరం అధికారానికి వచ్చిన టిడిపి వెలుగొండపై ఉదాశీనంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు అనుసంధానం ద్వారా ఎత్తిపోతల పథకాలు నిర్మాణం చేసినప్పటికీ గ్రాఫిక్స్ సంస్కృతితో టిడిపి అబాసుపాలైంది. విడిపోయిన రాష్ట్రంలో రాజన్న రాజ్యం తెస్తానంటూ వైసిపి అధినేత జగన్‌ భారీ పాదయాత్ర చేశారు. చంద్రబాబు పథకాలు, రైతుల రుణమాఫీ అవస్థలు, ప్రభుత్వ వ్యతిరేకత కలిసి డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ తనయుడిగా ప్రజలు జగన్ వైపు మొగ్గు చూపారు. 2019ఎన్నికల్లో 151సీట్లు రావడంతో టిడిపి కంగుతుంది. భారీ విజయాన్ని సాధించిన జగన్ మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో సంక్షేమంతోపాటు జిల్లాల పునర్విభజన చేశారు. పరిపాలన సౌలభ్యం లక్ష్యంగా జిల్లాలు ఏర్పాటు చేయకుండా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా చేసిన పునర్విభజన చేసింది. మార్కాపురం జిల్లా ఏర్పాటుకు వైసిపి ప్రభుత్వం నిరాకరించింది. గిద్దలూరు, యర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రం ఒంగోలుకు వెళ్లడం ఎంత కష్టమో ప్రతిపక్షాలు, ప్రజలు వివరించారు. సంక్షేమం పేరుతో జగన్ అభివృద్ధికి ప్రాధాన్యత తగ్గించారు. వెలుగొండ వంటి కీలక ప్రాజెక్టుల నిర్మాణాలను అటకెక్కించారు. రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లలో ప్రకాశం జిల్లాలో అభివృద్ధిలో ఏమాత్రం పురోగతి లేదు. టిడిపి, వైసిపి రెండు పార్టీలు ప్రకాశం జిల్లాపై సవతి ప్రేమ ప్రదర్శించారే తప్ప వెలుగొండ పూర్తికి కంకణ బద్దలు కాలేదు. అధికార వైసిపికి ప్రభుత్వ వ్యతిరేకతతోపాటు అభివృద్ధి అంశం కీలకంగా మారింది. దశాబ్దాలుగా వెనుకబడిన ఈ ప్రాంతానికి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడంలో వాయిదాల పద్ధతి అనుసరిస్తూ జగన్ నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలు ఉన్నాయి. అసంపూర్తిగా ప్రాజెక్టును ప్రారంభించి నీళ్లు రాని వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశానని జగన్ హడావుడి ప్రచారం చేసుకుంటున్నారు. దీనికి తోడు మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు అంశం కీలకంగా మారింది. 1972లో జిల్లాల విభజనతో అభాసు పాలైన ప్రకాశం జిల్లా జగన్‌ హయాంలో మరోసారి అభివృద్ధికి నోచుకోలేదని ఆలోచిస్తున్నారు. జిల్లాలో కీలక అంశంగా వెలుగొండను తీసుకున్న టిడిపి వాటిని ముందు పెట్టి ఎన్నికల ప్రచారం చేస్తుంది. అధికార వైసిపి జగన్ సంక్షేమ పథకాలను వల్లె వేస్తూ ప్రచారం చేస్తున్నారు. మార్కాపురం జిల్లా, వెలిగొండ అంశాలనే టిడిపి ప్రధాన ప్రచార అస్త్రాలుగా ఎంచుకుంది. ఈ పరిస్థితుల్లో పశ్చిమ ప్రాంత ప్రజల సంక్షేమానికి ఓటు వేస్తారా? అభివృద్ధి బాటపడతారా? అనేది వేచి చూడాల్సి ఉంది.

➡️