సోషల్‌ మీడియాలో ప్రచార జోరు

Apr 21,2024 00:14

ప్రజాశక్తి-గుంటూరు సిటీ ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుకోసం ప్రధాన రాజకీయ పార్టీలు సోషల్‌మీడియా వేదికగా ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాయి. గత ఎన్నికలలో సోషల్‌ మీడియా ప్రభావం అంతగా లేదు. ఈసారి యువ ఓటర్లు లక్ష ల్లో ఉన్నారు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటోంది. యువత ప్రత్యేకంగా వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ తో పాటు వివిధ పార్టీల వాట్సప్‌ గ్రూప్‌ల ద్వారా తమ పార్టీకి చెందిన నాయకులమీద అభిమానం కురిపిస్తూ ప్రత్యర్థుల పార్టీల మీద బురదజల్లే కార్యక్రమం చేపట్టారు. టిడిపి ఫోన్ల ద్వారా ఒక నిమిషం పాటు రికార్డింగ్‌ పాటలు పెడుతూ మీకు నచ్చితే ఒకటి నొక్కాలని సాంకేతికంగా సంబంధిత ఓటరు తమకు అనుకూలమో…కాదో..? నిర్ధారించుకుంటోంది. ఒక వేళ ఫోన్‌ ఆన్సర్‌ చేయకపోతే పదేపదే చేస్తున్నారు. టిడిపికి అనుకూలంగా సంబంధిత వ్యక్తి ఒక్కటి నొక్కే దాకా వెంటపడుతూ పదేపదే ఫోన్లు చేసి విసిగిస్తున్నారు. జరుగు…జరుగు జగన్‌… కుర్చి ఖాళీ చేయాలంటూ తెలంగాణ యాసతోఒక పాటను పదేపదే విన్పిస్తున్నారు. బిజిగా ఉంటున్న ప్రజలకు, ఉద్యోగులు, వ్యాపారులకు ఈ ఫోన్లు చికాకు తెప్పిస్తున్నాయి. ఒకే నెంబరుకు ఎక్కువ సార్లు ఈ కాల్స్‌ వస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌, ఛండీఘర్‌ కేంద్రంగా ఉన్న ఈ నెంబర్లు ద్వారా ఎక్కువగా సిఎం జగన్‌కు వ్యతిరేకంగా చంద్రబాబుకు అనుకూలంగా ఫోన్‌ కాల్స్‌వస్తున్నాయి. వీటిపై పోలీసులు దృష్టి సారించడంలేదు. మీడియా మానిటిరింగ్‌ కమిటీ పేరుతో ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌మీడియాపై అనేక ఆంక్షలు అమలు చేస్తున్నా ఎన్నికల అధికారులు సోషల్‌ మీడియాపై ఎటువంటి నియంత్రణ అమలు చేయకపోవడం వల్ల అభ్యర్థులు తమ ప్రచారం అంతా సోషల్‌ మీడియాలో ఎక్కువగా చేసుకుంటున్నారు.ఇందుకోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్నా ఈ ఖర్చును నమోదుచేయడంలేదు. అలాగే మీడియాలో ఎడ్వటెజ్‌మెంట్లపై ఆంక్షలు విధించించిన ఎన్నికలకమిషన్‌ సోషల్‌ మీడియాలో కుప్పలు కుప్పలుగా ఎడ్వటెజ్‌మెంట్లు వేస్తున్నాపట్టించుకోవడం లేదు. ప్రతి అభ్యర్థి సోషల్‌ మీడియాలో రూ.లక్షలు కుమ్మరించి తమకు అనుకూలంగా, ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇందుకోసం ప్రతి అభ్యర్థి ఒక నెట్‌ వర్కును ఏర్పాటు చేసుకున్నారు. దీనిపై ఎటువంటి నియంత్రణ ఉండటం లేదు. నియంత్రణకు ఎటువంటి నియామావళీ, నిబంధనలూ లేవు. ఫేక్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌,వాట్సాప్‌ వంటి వేదికల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. కొందరు అభ్యర్థులు నామినేషన్లకు వాయిస్‌ మెసెజ్‌ల ద్వారా అర్ధరాత్రి సందేశాలు పంపుతున్నారు. ఒక నంబరు నుంచి మరొకరు ఫేక్‌ ఖాతాలను తెరిచి ప్రత్యర్థులను ఇబ్బందిపేట్టేలా ప్రచారం కొనసాగిస్తున్నారు. సామాజిక మాద్యమాలపై నిఘా పెట్టామని అధికారులు చెబుతున్నా ప్రజలను విసిగిస్తున్న ఫోన్‌ కాల్స్‌, వాయిస్‌ మెసెజ్‌లు, పాటలపై తక్షణం నియంత్రణ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

➡️