ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తా

May 10,2024 13:13 #kaile
  • పామర్రు నియోజకవర్గ వైసిపి అభ్యర్థి కైలే అనిల్‌కుమార్
    ప్రజాశక్తి-పమిడిముక్కల,తోట్లవల్లూరు
    తనకు మరోసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని పామర్రు నియోజకవర్గ వైసిపి అభ్యర్థి కైలే అనిల్‌కుమార్‌అన్నారు. గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలోని పామర్రు, పెదపారుపూడి, పమిడిముక్కల, తోట్లవల్లూరు, మొవ్వ మండలాల్లో తన ఎన్నికల ప్రచారాన్ని పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుద్దేశించి మాట్లాడారు. నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషిచేస్తానన్నారు. పామర్రు, పెదపారుపూడి, తోట్లవల్లూరు, పమిడిముక్కల, మొవ్వ మండలాల్లోని అన్ని ప్రాంతాల్లో సమానస్థాయిలో అభివృద్ధి జరిగేలా కృషిచేస్తానన్నారు. పామర్రు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దటానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. ముఖ్యంగా ప్రజలకు మెరుగైన మౌళిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అమలు చేసిన నవరత్నాల పథకాలు అన్ని తరగతుల ప్రజానీకానికి ఎంతగానో మేలు చేశాయన్నారు. ప్రజల మనిషిగా సంక్షేమ పథకాల ద్వారా కోట్లాది ప్రజల జీవితాల్లో ముఖ్యమంత్రి వెలుగులు నింపారన్నారు. మహిళల్లో ఆర్థిక స్వావలంభన పెంపొందించారన్నారు. విద్యతోనే సమాజం మారుతుందని విశ్వసించి జగన్మోహన్‌ రెడ్డి విద్య, వైద్య రంగాలకు పెద్ద పీటవేశారన్నారు. అమ్మబడి, విద్యా కానుక, గోరుముద్ద, విద్యా దీవెన వసతి దీవెన, విదేశీ విద్య అంటే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. మహిళలకు చేయూత, భరోసా వంటి అనేక సంక్షేమ పథకాలను చేపట్టారన్నారు. లక్షలాదిమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు. ప్రభుత్వాన్ని ఇంటిగుమ్మం ముందుకు సెక్రటేరియట్‌, వాలంటరీ వ్యవస్థ ద్వారా తెచ్చిన ఏకైక ముఖ్యమంత్రి అని అన్నారు. మరోసారి ఫ్యాన్‌ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు. పూలే, అంబేద్కర్‌, గాంధీ ఆశయాల శిల్పం జగన్మోహన్‌ రెడ్డి అని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయం అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. అబద్దాలతో కాలం వెళ్లదీసే పార్టీ టిడిపి అని విమర్శించారు. టిడిపికి ఓటేస్తే బిజెపికి వేసినట్లేనన్నారు. గత ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో పేదలను అష్ట కష్టాలపాలు చేసిందన్నారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ తేడా లేకుండా అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాల అందించిన ఏకైక ప్రభుత్వం వైసీపీదేనన్నారు. రెండు బటన్లను నొక్కి జగనన్న రుణం తీర్చుకోవాలన్నారు. చంద్రబాబునాయుడు పద్నాలుగేళ్లు సీఎంగా పని చేసిన కాలమంతా మోసపూరితంగానూ, పాపాల పుట్టగా సాగిందన్నారు. చంద్రబాబు నాయుడి పేరు చెబితే ఒక్క పథకం, చేసిన మంచి గుర్తుకు రాదని విమర్శించారు. వైసిపి 58 నెలల పాలనలో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులెన్నో తీసుకొచ్చామన్నారు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా రూ.2.70 లక్షల కోట్లును బటన్‌ నొక్కడం ద్వారా నేరుగా అక్కచెల్లమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమయ్యాయన్నారు. ఎక్కడా లంచాలు, వివక్ష లేదనీ, నేరుగా వారి ఖాతాల్లోకే డబ్బులు వెళ్లిపోయాయన్నారు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయన్నారు. మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేసిన ఘనత వైసిపి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఆసరా, చేయూత, సున్నావడ్డీ, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, అక్కచెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు వారిపేరిట రిజిస్ట్రేషన్‌ చేయించే కార్యక్రమంతో పాటు అందులో 22 లక్షల ఇళ్లు కడుతున్న కార్యక్రమం కూడా చేపట్టామని వివరించారు. అక్కాచెల్లెమ్మల స్వాలంబన, సాధికారత కోసం ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం గతంలో ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. అవ్వాతాతలకు ఇంటికే రూ.3000 పెన్షన్‌ కానుక ఇస్తున్నామన్నారు. ఇంటి వద్దకే పౌర సేవలు, పథకాలు.. ఇవన్నీ ఇంటికే వచ్చే పాలనగానీ, పథకాలుగానీ గతంలో ఎప్పుడైనా చూశారా?. రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా రైతుభరోసా, రైతన్నలకు ఓ ఉచిత పంటలబీమా, సీజన్‌ ముగిసేలోగా ఇన్‌పుట్‌ సబ్సిడీ, పగటి పూటే 9 గం.ల ఉచిత విద్యుత్‌, ఒక ఆర్బీకే వ్యవస్థ…ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని ప్రశ్నించారు. స్వయం ఉపాధికి అండగా తోడుగా ఉంటూ సొంత ఆటోలు, టాక్సీలు నడుపుతున్న డ్రైవరన్నలకు ఓ వాహన మిత్ర, నేతన్నలకో నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసాతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లకు, పక్కనే తోపుడు బళ్లలో ఉన్నవాళ్లకు, ఇడ్లీ కొట్టు పెట్టుకున్న వాళ్లకు, శ్రమజీవులకు తోడుగా ఉంటూ ఓ చేదోడు, ఓ తోడు అనే పథకం అందిస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షల దాకా ఉచితంగా వైద్య సేవలు పొందొచ్చునన్నారు. పేదవాడికి ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే విలేజ్‌ క్లినిక్‌, ే ఫ్యామిలీ డాక్టర్‌. ఇంటికే ఆరోగ్య సురక్ష వంటివి ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. పామర్రు నియోజకవర్గంలో మునుపెన్నడూలేని విధంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామన్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రజానీకం నుంచి తనకు మంచి ఆదరణ లభిస్తోందన్నారు. తిరిగి శాసనసభ్యుడిగా ఎన్నికై పామర్రు నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిరంతరం కృషిచేస్తానని సిట్టింగ్‌ ఎమ్మెల్యే, వైసిపి పామర్రు నియోజకవర్గ అభ్యర్థి కైలే అనిల్‌కుమార్‌ వివరించారు. ఈ కార్యక్రమంలో వైసిపి తోట్లవల్లూరు మండల కన్వీనర్‌ కళ్ళం వెంకటేశ్వరరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు జన్నల రామ్మోహనరెడ్డి, ఎంపిపి ఈడ్పుగంటి రాజారమణి, వైసిపి జిల్లా సీనియర్‌ నాయకులు నడకుదురు రాజేంద్ర, వైసిపి పమిడిముక్కల మండల కన్వీనర్‌ యలమంచిలి గణేష్‌బాబు, ఎంపిపి కాసాని వేద సుప్రజ, మారపాక మహేశ్వరరావు, పాతూరి చంద్రపాల్‌, ఆదిశేషు, కొడమంచిలి మహేష్‌ తదితరులు పాల్గంటున్నారు.
➡️