పారిశ్రామిక ప్రాంతమైనా దశాబ్ధాలుగా కలగానే రైల్వేలైను

Apr 26,2024 00:26

కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న సభ్యులు
ప్రజాశక్తి-చిలకలూరిపేట :
పారిశ్రామిక కేంద్రంగా విరాజిల్లుతున్న చిలకలూరిపేటలో రైల్వేలైను ఏర్పాటు ఈ ప్రాంత ప్రజలకు ఇంకా కలగానే ఉందని రైల్వే లైన్‌ సాధన సమితి కన్వీనర్‌ షేక్‌ సుభాని అన్నారు. స్థానిక ఎన్‌ఆర్‌టి సెంటర్లోని సిపిఐ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాల కిందటే నాటి చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్న సోమేపల్లి సాంబయ్య నాటి గుంటూరు ఎంపీ ఆచార్య ఎన్జీ రంగా దృష్టికి రైల్వే ఆవశ్యకత తీసుకెళ్లారని, అనంతరం ఇద్దరూ ఆనాటి రైల్వేమంత్రి ఘనిఖలాన్‌ చౌదరికి విన్నవించారని చెప్పారు. కాటో (కాటన్‌, టుబాకో) సిటీగా పేరున్న చిలకలూరిపేట ప్రాంతం పారిశ్రామికంగా ఎంతో ఆభివృద్ధి చెందిందని, స్థానిక పరిశ్రమల నుంచి ఇతరా రాష్ట్రాలకు ఎగుమతులు, దిగుమతులు నిత్యం కొనసాగుతుంటాయని చెప్పారు. ఇక్కడ నుంచి గుంటూరు, చీరాల, ఒంగోలుకు వెళ్లి ఆక్కడ నుంచి రైలు మార్గాన సరుకులను రవాణా చేస్తుంటారని, సరకు రవాణాతో పాటు ఈ ప్రాంతంలో రైల్వేలైను ఏర్పడితే పలు ప్రాంతాలకు చేరేందుకు ఈ ప్రాంతవాసులకు వ్యయప్రయాసలు తగ్గే ఆవకాశం ఉందని వివరించారు. గ్రానైట్‌ పరిశ్రమల నుంచి ఎగుమతులు, దిగుమతులయ్యే ఆవకాశం ఉంటుందన్నారు. స్థానికంగా ఉన్న మిల్లులు, గ్రానైట్‌ పరిశ్రమలు తమ సరుకులను దూరప్రాంతాలకు రవాణా చేయడానికి ఏటా సుమారు రూ.100 కోట్లు వెచ్చిస్తున్నారని తెలిపారు. స్థానికంగా ఉన్న పలు పరిశ్రమల్లో వేలాది మంది కార్మికులు ఇతరా రాష్ట్రాలకు చెందినవారేనని, వారి ప్రయాణ సౌకర్యానికి రైల్వేలైను ఎంతో ఆవసరం ఉందని, పర్యాటక రంగం ఆభివృద్ధి చెందుతున్న దష్ట్యా కొండవీడు వంటి చారిత్రక ప్రదేశాలకు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ప్రయాణం సౌకర్యంగా ఉంటుందని అన్నారు. దీనినై ప్రభుత్వాలు దృష్టిపెట్టాలని కోరారు. కార్యక్రమంలో కె.వెంకటేశ్వర్లు, ఎలిక శ్రీనివాసరావు, ఎ.పురుషోత్తం, ఎడవల్లి రామారావు, టి.జీవరత్నం, నన్నే, నానా, బి.జాను పాల్గొన్నారు

➡️