గ్రంథాలయంలో పుస్తకపఠనం

May 16,2024 20:23

ప్రజాశక్తి -గరుగుబిల్లి : మండల కేంద్రంలోని శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరం కార్యక్రమంలో భాగంగా గురువారం పుస్తక పఠనం కార్యక్రమాన్ని నిర్వహించారు. క్విజ్‌ పోటీలు నిర్వహించడంతోపాటు అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రను విద్యార్థులకు చదివి వినిపించారు. ఆటల పోటీలు తదితర కార్యక్రమాలను ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తున్నామని శాఖా గ్రంథాలయ నిర్వాహకులు నల్ల మధుసూదన రావు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జూన్‌ 11వ తేదీవరకు వేసవి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ముందుగా సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులను కలిసి గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొనేలా చర్యలు చేపట్టామన్నారు. ఈ మేరకు విద్యార్థులు వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాలకొండ : స్థానిక శాఖా గ్రంథాలయంలో వేసవి సెలవుల్లో పిల్లలు ఎండల్లో తిరగకుండా ప్రతి ఏటా వేసవి శిబిరాలు గ్రంథాలయంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇక్కడ విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు, మేథస్సుకు సంబంధించిన ఆటలు ఆడించడం జరుగుతుంది. కార్యక్రమంలో ఎక్కువ మంది పిల్లలు పాల్గొన్నారు. కళా అంకురం డైరెక్టర్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌ కుమారి అల్లు ప్రియాంక పిల్లలకు గ్రంథాలయం చిన్న అల్లికలు, దారంతో కొన్ని రకాల బొమ్మలు ఎలా తయారు చేయాలో చెప్పారు. ఆమె పిల్లలకు చిన్న కథలు పుస్తకం చదవడం ద్వారా పిల్లలకు ఆనందం కలుగుతుందని చెప్పారు. ఇన్‌ఛార్జి గ్రంథాలయ అధికారి బబ్బురు గణేష్‌ బాబు, సహాయకుడు ఈశ్వర్‌ పాల్గొన్నారు.

➡️