సాగర్‌ నీటిని మరో 10 రోజులివ్వాలి

Apr 18,2024 00:19

సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకుకు నీటి పంపిగ్‌ను పరిశీలిస్తున్న సిపిఎం నాయకులు
ప్రజాశక్తి-సత్తెనపల్లి :
చెరువులు పూర్తిస్థాయిలో నిండాలంటే సాగర్‌ నీటి విడుదలను మరో 10 రోజులు పొడిగించాలని సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు. చెరువులకు నింపే నీరు ఎండల తీవ్రతకు ఆవిరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కువ నీటిని చెరువులకు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. పట్టణంలోని సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకును ఆ నాకీంట బృందం బుధవారం సందర్శించింది. అక్కడనున్న సిబ్బందితో సాగర్‌ జలాలతో సమ్మర్‌ స్టోరేజ్‌ను నింపుతున్న తీరును వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి కోసం నాగార్జునసాగర్‌ కుడికాల్వకు నీరు విడుదల చేసిన వెంటనే అధికారులు స్పందించి ఇంజన్లు, మోటార్లు పెట్టి సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ను నింపేందుకు చర్యలు చేపట్టడాన్ని అభినందించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు గద్దె చలమయ్య, పట్టణ కార్యదర్శి డి.విమల మాట్లాడుతూ ఈనెల 13వ తేదీ నుండి 20 మోటార్లతో మంచినీళ్ల చెరువును నింపుతున్నా నింపాల్సిన దానిలో ఇప్పటికీ సగం కూడా నిండలేదని అన్నారు. ఈ నీరు మళ్లీ సాగర్‌ జలాలు విడుదల చేసే వరకు అంటే జూలై, ఆగస్టు మాసాల వరకు పట్టణ అవసరాలకు సరిపోయ్యో పరిస్థితి లేదన్నారు. ఈ నేపథ్యంలో చెరువును పూర్తిస్థాయిలో నింపటానికి మరో పది రోజులు సమయం పడుతుందని అన్నారు. కావున నాగార్జునసాగర్‌ జలాల సరఫరాను మరో 10 రోజులు పొడిగించాలని డిమాండ్‌ చేశారు. ఎండలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పట్టణంలోని తాగునీటిని క్రమం తప్పకుండా సరఫరా చేయాలని కోరారు. లేకుంటే నీటి ఎద్దడి ఏర్పడి తాగునీరు లీటర్ల చొప్పున కొనుక్కొని తాగాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి వస్తే పట్టణ ప్రజలకు ఒక్కొక్క ఇంటికి నెలకు రూ.300 చొప్పున అదనంగా ఖర్చవుతుందని తెలిపారు. సత్తెనపల్లి పట్టణ ప్రజలు, పరిసర గ్రామాల ప్రజలు అనేక పనుల నిమిత్తం పట్టణానికి వస్తారని, వారు సేద తీర్చుకునేందుకు పట్టణంలో జన సందోహం ఉన్న ప్రదేశాల్లో చలివేంద్రాలు, చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్‌ అధికారులను కోరారు. పరిశీలనలో సిపిఎం నాయకులు కె.శివదుర్గారావు, ఎ.ప్రసాదరావు, పి.ప్రభాకర్‌, షేక్‌ మస్తాన్‌వలి, జె.రాజ్‌కుమార్‌ ఉన్నారు.

➡️