ఉపాధి హామీ కూలీలకు వేతన బకాయిలు చెల్లించాలి

ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతున్న సిఐటియు నేత కోటేశ్వరరావు

ప్రజాశక్తి-పరవాడ

మండలంలో ఉపాధి హామీ కూలీలకు నాలుగు వారాలుగా వేతనాలు చెల్లించడం లేదని, వెంటనే వేతన బకాయిలు చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. మండలంలోని కన్నూరు, మడకపాలెం గ్రామాల్లో ఉపాధి హామీ పని ప్రదేశాలకు వెళ్లి ఉపాధి హామీ కూలీలతో వారు సమావేశాలు నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూలీలకు పే స్లిప్పులు ఇవ్వాలని, తట్ట, పార, గుణపాం వంటి పనిముట్లుకు డబ్బులు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కూలీలకు రోజు కూలి రూ.300 ఇస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా ఎక్కడా అది అమలు కావడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు కొలతలతో సంబంధం లేకుండా రోజుకు రూ.300 చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి కూలీలకు ఏడాదికి 200 పని దినాలు కల్పించాలని, రోజు కూలి రూ.600కు పెంచాలని, ఉపాధి హామీ పనులు గ్రామాల్లో నిర్వహించాలని, ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. పరవాడ మండలంలోని వెన్నెలపాలెం, పి.బోనంగి గ్రామాల్లో ఉపాధి హామీ పనులు నిర్వహించకపోవడం వల్ల కూలీలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కార్మికులు పాల్గొన్నారు.

➡️