స్కీమ్‌ వర్కర్లు, కార్మికుల్లో తొలగింపు భయం

Jun 26,2024 22:59

మాట్లాడుతున్న జి.రవిబాబు
ప్రజాశక్తి – క్రోసూరు :
గ్రామాల్లో ప్రజలకు వివిధ రకాల సేవలందిస్తున్న చిరుఉద్యోగులను తొలగిస్తామనే భయాందోళనలకు గురి చేయటం తగదని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.రవిబాబు అన్నారు. స్థానిక ఆమంచి విజ్ఞాన కేంద్రంలో బుధవారం జరిగిన సిపిఎం మండల సమావేశానికి ముత్యాల పౌలు అధ్యక్షత వహించారు. రవిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పడినప్పటి నుండి అంగన్వాడి, ఆశ, మధ్యాహ్నం భోజనం, వివోఏ, పంచాయతీ కార్మికుల్లో తొలగింపు భయం నెలకొందన్నారు. కొత్తవారిని నియమించుకుంటామని, ఉన్నవారు రాజీనామా చేయాలనే రాజకీయ ఒత్తిళ్లు చేస్తున్నట్లు తెలిసిందని అన్నారు. గత ప్రభుత్వం ఇలా వ్యవహరించబట్టే ప్రజల చీత్కారానికి గురైందనే విషయం తాజా ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు గుర్తించాలని సూచించారు. రాజకీయ వేధింపులకు పాల్పడితే అధికారానికి దూరమవ్వక తప్పదని హెచ్చరించారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే స్పష్టతివ్వాలని, స్కీమ్‌ వర్కర్లు, కార్మికుల్లో భయాన్ని తొలగించాలని కోరారు. దొడ్లేరు చెరువు మెరక భూములను పెరికపాడుకు చెందిన పేద దళితులు అనేక సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నారని, ఆ భూముల్లో పొక్లెయినర్ల ద్వారా తవ్వకాలు అన్యాయమని అన్నారు. గతంలో వైసిపి నాయకులు తవ్వకాలకు యత్నించగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిలువరించామని గుర్తు చేశారు. భూ యజమాని సంతకంతో సంబంధం లేకుండా కౌల్దార్లందరికీ గుర్తింపు కార్డులు, పంట రుణాలు, నష్టపరిహారం, సబ్సిడీ, రాయితీలపై విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు నాలుగైదు వారాలుగా వేతనాలు ఇవ్వలేదని, వెంటనే విడుదల చేయాలని కోరారు. సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి టి.హనుమంతరావు, నాయకులు ఎ.ఆంజనేయులు, సిహెచ్‌.యేసయ్య, ఎ.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

➡️