హత్య కేసులో ఏడుగురు నిందితుల అరెస్టు

మాట్లాడుతున్న ఎస్‌పి మురళీకృష్ణ

ప్రజాశక్తి-అనకాపల్లి

హత్య కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి కారు, సెల్ఫోను, నగలతో పాటు హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌పి మురళీకృష్ణ వెల్లడించారు. స్థానిక పోలీస్‌ అతిథి గృహంలో మంగళవారం విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. ఎస్‌పి అందించిన వివరాల ప్రకారం… అనకాపల్లి జిల్లా వి మాడుగుల మండలం ఎం కోటపాడుకు చెందిన సేనాపతి రామాంజనేయులు తన తండ్రి నాగరాజు ఇచ్చిన ఆరు లక్షల రూపాయలతో ఎం.కోటపాడులో రెస్టారెంట్‌ ఏర్పాటు చేసుకున్నారు. దానిని సక్రమంగా నిర్వహించలేక ఇంకా డబ్బు కావాలని, ఆస్తులు పంచాలని తన తల్లిదండ్రులను, సోదరుడు శివాజీని తరచూ వేధించడం, కొట్టడం చేసేవాడు. దీంతో విసుగు చెందిన తండ్రి సోదరుడు శీలమనేని గోపి, మేడం అంజిరెడ్డి, అందే నాగేంద్రబాబు, ఉప్పు తోట్ల మురళీకృష్ణ, పక్కన శివ అనే ఐదుగురితో కలిసి రామాంజనేయులను చంపేందుకు కుట్ర చేశారు. ఇందుకు ఎనిమిది లక్షల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్స్‌గా రూ.6 లక్షలు ఇచ్చారు. ఈ మేరకు తండ్రి సోదరుడు మినహా నిందితులు ఈనెల 21న రెస్టారెంట్లో రామాంజనేయులకు మద్యం పట్టించి వడ్డాదిలో దింపుతామని కారులో ఎక్కించుకొని మధ్యలో కత్తితో పొడిచి హత్య చేశారు. మృతదేహాన్ని ఎలమంచిలి మండలం కొక్కిరేపల్లి వద్ద ట్యాంకులో వేసి పరారయ్యారు. ఈ నేపథ్యంలో మృతుని భార్య శ్రీదేవి ఈనెల 21 నుంచి తన భర్త కనిపించలేనట్టు 23వ తేదీన పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. అయితే ఎలమంచిలి రూరల్‌ మండలం కొక్కిరాపల్లి వద్ద చెరువులో ఒక మృత దేహం ఉన్నట్టు తెలియడం, ఆ మృతదేహం తన భర్తది అని శ్రీదేవి చెప్పడంతో పోస్టుమార్టంలో హత్యగా గుర్తించారు. దీనిపై ఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఐదు బృందాలతో సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంగళవారం తమ విఆర్‌ఓ సమక్షంలో రామాంజనేయులు తండ్రి నాగరాజు, సోదరుడు శివాజీతో పాటు మూడో ముద్దాయి శీలమనేని గోపి మాడుగుల పోలీస్‌ స్టేషన్లో లొంగిపోయారు. వారిచ్చిన సమాచారంతో మిగిలిన నలుగురిని అరెస్టు చేసినట్టు ఎస్పీ తెలిపారు. వారి నుంచి మారుతి స్విఫ్ట్‌ కారు, రూ.2250 నగదు, 23 గ్రాముల బంగారు ఆభరణాలు, ముద్దాయిల 6 సెల్‌ ఫోన్లు, నేరం కోసం ఉపయోగించిన కత్తి, నేరానికి ఉపయోగించిన రెండు టవళ్లు, ఏ3, ఏ4 బ్యాంక్‌ ఖాతాలలో రూ.75,000 నగదు గుర్తించినట్టు తెలిపారు. కేసు దర్యాప్తులో పాలుపంచుకున్న సిబ్బందిని ఎస్పీ మురళీకృష్ణ అభినందించారు. సమావేశంలో పట్టణ సీఐ శంకర్రావు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️