నీట్‌లో అవకతవకలపై ఎస్‌ఎఫ్‌ఐ నిరసన

ఆర్టీసీ కాంప్లెక్స్‌ కూడలిలో మావనహారం నిర్వహిస్తున్న విద్యార్థులు

ప్రజాశక్తి-అనకాపల్లి

దేశ వ్యాప్తంగా వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ పరీక్షలో పెద్ద ఎత్తున చోటుచేసుకున్న అక్రమాలు, అవకతవకలపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) అనకాపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ కూడలిలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం రమణ మాట్లాడుతూ కొన్ని రోజులుగా నీట్‌ పరీక్ష స్కాంపై అభ్యర్థులు గగ్గోలు పెట్టడంతో పాటు న్యాయస్థానాలను ఆశ్రయించినా కేంద్రంలో మోడీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. చివరికి సుప్రీం కోర్టు కేంద్రానికి, నీట్‌ను నిర్వహించిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టిఎ)కు నోటీసులు జారీ చేశాక ఎట్టకేలకు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్పందించి రెండు చోట్ల అక్రమాలు జరిగినట్లు గుర్తించామని అంగీకరించారని తెలిపారు. నీట్‌లో అక్రమాలపై మోడీ సర్కారు కించిత్తు పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయలేదని, దీనిని బట్టి నీట్‌ స్కామ్‌ను మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కేందుకు చూస్తున్నట్లు అర్థమవుతుందని పేర్కొన్నారు. బిజెపి, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల కేంద్రంగా నీట్‌ స్కాం జరిగిందని ఇప్పటి వరకు నమోదైన కేసులను బట్టి తెలుస్తోందన్నారు. మే 5న నిర్వహించిన నీట్‌ పరీక్షను 24 లక్షల మంది రాశారని, నేడు వారి భవిష్యత్తు అగమ్యగోచరం కావడం బాధాకరమన్నారు. నీట్‌ పరీక్షలో జరిగిన అవకతవకలపై తక్షణమే సుప్రీం, లేదా హైకోర్టు న్యాయమూర్తితో న్యాయ విచారణ జరిపించాలని, పరీక్షల నిర్వహణ నుంచి ఎన్‌టిఎను తప్పించాలని, దేశవ్యాప్తంగా మళ్లీ నీట్‌ పరీక్ష నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి శివాజీ, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

➡️