మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక దృష్టి

ఎఒబి సరిహద్దులోని ప్రధాన రహదారిపై పహారా కాస్తున్న పోలీసులు

ప్రజాశక్తి -సీలేరు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులు విద్రోహక చర్యలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని ఇంటలిజెన్స్‌ వర్గాలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో మావోయిస్టుల కదిలికలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సురక్షితంగా ఎన్నికల సిబ్బంది ఈవీఎంలు చేరే విధంగా పగడ్బందీ చర్యలు చేపట్టారు. మావోయిస్టులు ఎటువంటి చర్యలకు ఉపక్రమించిన దీటుగా ప్రతిఘటించడానికి కేంద్ర పోలీస్‌ బలగాలను రంగంలో దింపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు ముందస్తుగానే పోలీసులు చేరుకొని అణువణువునా గాలింపు చర్యలు చేపడుతున్నారు. మావోయిస్టుల కదలికలు, వారికి సహకరించే సానుభూతిపరులపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు మూలమూరు గిరిజన గ్రామాల్లో స్పెషల్‌ పార్టీ, గ్రేహోండ్స్‌, ఆక్టోపాస్‌ తదితర బలగాలను వందల సంఖ్యల్లో దింది జల్లెడ పడుతున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణ, చతీష్‌ఘడ్‌ రాష్ట్రాల్లో 50 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా మావోయిస్టులు పోలీసు బలగాలను తరలిస్తున్న వాహనాలు లక్ష్యంగా చేసుకొని గ్రానైట్స్‌, ల్యాండ్‌ మైన్స్‌తో ప్రతీకార దాడులకు పాల్పడవచ్చని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బాంబు స్క్వాడ్‌ బృందాలతో ముందస్తుగా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. స్థానిక ఎస్సై రామకృష్ణ ఆధ్వర్యంలో సిఆర్పిఎఫ్‌ బలగాలను జీకే వీధి మండలం సీలేరు నుంచి మైదాన ప్రాంతానికి వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా, కల్వర్టులు, ముఖ్య కూడళ్లలో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఆదివారం వారపు సంతలో మావోయిస్టు సానుభూతిపరులు యాక్షన్‌ టీం సభ్యులు సంచారంపై దృష్టి సారించి ఆ దిశగా గోప్యంగా తనిఖీలు చేపట్టారు. పోలింగ్‌ బూతులు ఏర్పాటు చేసిన సీలేరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పరిసరాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. జికె.వీధి సిఐ, ఎస్‌ఐల ఆధ్వర్యాన మండలంలోని ఆదివారం రహదారులు, కల్వర్టులు మెటల్‌ డిటెక్టర్లతో, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలతో తనిఖీలు చేశారు. ఆధునిక డ్రోన్‌ కెమెరాలతో నిఘామావోయిస్టుల కదిలికులపై అత్యాధునిక పరిజ్ఞానం కలిగిన డ్రోన్‌ కెమెరాలతో నిరంతరం నిఘా పెట్టినట్లు సిఐలు అశోక్‌ కుమార్‌, అప్పలనాయుడు, జికె.వీధి ఎస్‌ఐ అప్పలసూరి తెలిపారు. ఆదివారం వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మావోయిస్టుల నుంచి ఎటువంటి ముప్పు వాటిల్లకుండా సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలను ఉపయోగిస్తున్నామన్నారు. మావోయిస్టు ఎటువంటి చర్యలకు ప్రయత్నించినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఇందులో భాగంగానే అనుమానిత ప్రదేశాలను డ్రోన్‌ కెమెరాలతో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకోవాలని కోరారు. ఎవరైనా అనుమానస్పద వ్యక్తులు తారసపడితే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. తాము వినియోగిస్తున్న డ్రోన్‌ కెమెరాలతో ఎన్నికలు ఓటింగ్‌ జరిగే ప్రదేశం నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో మావోయిస్టులు కదిలికలపై నిరంతరం నిఘా ఉంటుందని తెలిపారు. ఎన్నికల్లో ఎటువంటి గొడవలు సృష్టించకుండా ప్రతి ఒక్కరూ పోలీసులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

➡️