అంగన్‌వాడీల ఆగ్రహం

హిందూపురంలో నిరసన తెలుపుతున్న అంగన్‌వాడీలు

 

హిందూపురం :సమస్యల పరిష్కారంపై అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె ఉధృతం అవుతోంది. 2వ రోజు బుధవారం నాడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ అంగన్‌వాడీ టీచర్లు, మినీటీచర్లు, ఆయాలు నిరసన దీక్షల్లో పాల్గొన్నారు. చట్టిబిడ్డలను ఎత్తుకుని దీక్షల్లో పాల్గొన్నారు. ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు శిబిరాల్లోనే కూర్చొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే ‘అంగన్‌వాడీ అక్కాచెల్లెమ్మల సమస్యలను పరిష్కరిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి గారూ… మాఆవేదను పట్టించుకోండి’.. అంటూ వేడుకున్నారు. అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మెకు అన్ని పార్టీలు, ప్రజాసంఘాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. సిపిఎం నాయకులు అంగన్‌వాడీల దీక్షల్లో పాల్గొని వారికి మద్దతు తెలిపారు. సిపిఎంతో పాటు టిడిపి, జనసేన పార్టీలు సైతం అంగన్‌వాడీలకు మద్దతు తెలిపారు.

పాదయాత్ర సందర్భంగా తెలంగాణ కంటే ఎక్కువ వేతనాలు ఇస్తామనే హామీతో పాటు ఇతర సమస్యలపై ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి స్పందించేంత వరకు సమ్మెను విరమించేది లేదంటూ అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు స్పష్టం చేశారు. ప్రభుత్వం సమస్యను పరిష్కరించాల్సింది పోయి సమ్మె చేస్తున్న వారిపై అధికారులతో బెదిరింపులకు దిగుతోందని, ఇలాంటి వాటికి బెదిరేది లేదన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీల సమ్మె కొనసాగుతోంది. 5126 అంగన్‌ వాడీ కేంద్రాల పరిధిలో అంగన్‌వాడీలు ఆందోళనబాటపట్టారు. పాదయాత్ర సందర్భంగా వేతనాలు పెంపు, ఇతర సమస్యలపై జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. సమ్మెలో భాగంగా మొదటి రోజు మంగళవారం నాడు ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయాల ముందు టెంట్‌లు వేసుకుని ఆందోళన చేపట్టారు. రెండవ రోజు బుధవారం నాడు తహశీల్దార్‌ కార్యాలయాల వద్ద సమ్మె కొనసాగించారు. తెలంగాణలో కంటే కనీసం రూ.వెయ్యి అదనంగా వేతనం ఇస్మాని అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో పాటు గ్రాడ్యూటీతో పాటు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్‌ చేస్తున్నారు. అంగన్‌ వాడీ కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని కేంద్రాలు మూతపడ్డాయి. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 11 ప్రాజక్టుల పరదిలో 30 మండలాల్లో 2301, శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా 12 ప్రాజెక్టుల పరిధిలో 33 మండలాల్లో మెయిన్‌ సెంటర్‌లు 2198, మినీ సెంటర్‌లు 627 మొత్తం 2825 అంగన్‌ వాడి కేంద్రాలు మూతబడ్డాయి.

ఇవీ డిమాండ్లు…

అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలి. సుప్రీంకోర్టు చెప్పిన మేరకు గ్రాట్యూటీపై అమలు చేయాలి.మినీ సెంటర్లను ప్రధాన కేంద్రాలుగా మార్చాలి. రిటైర్‌మెంట్‌ బెనిఫిట్‌ రూ.5లక్షలకు పెంచాలి. పెన్షన్‌ ఇవ్వాలి. మెనూ ఛార్జీలు పెంచాలి. పెండింగ్‌లో ఉన్న బిల్లులు, సెంటర్ల అద్దెలను వెంటనే విడుదల చేయాలి.కేంద్రాలకు నాణ్యమైన సరుకులను సరఫరా చేయాలి. అంగన్‌వాడీలపై రాజకీయ జోక్యాన్ని నివారించాలి.యాప్‌ల వేధింపులను నివారించాలి.

యాప్‌ల భారం తగ్గించాలి

లావణ్య, అంగన్‌వాడీ యూనియన్‌ ప్రాజెక్టు కార్యదర్శి.

  అంగన్‌వాడీ వర్కర్లకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ వంటి యాప్స్‌ తీసుకొచ్చారు. దీని వల్ల తీవ్ర పనిభారం పెరగింది. తక్షణం ఈ యాప్‌ల భారం తగ్గించాలి. సరుకులు సక్రమంగా ఇవ్వడం లేదు. పని భారం పెంచారు. ప్రభుత్వం ఇచ్చిన సెల్‌ ఫోన్లకు నెట్‌ రాదు. కార్యాలయాల అవసరాలకు సొంత ఫోన్లు వాడుతున్నాం. లోడ్‌ పెరగి అవి కూడా మొరాయిస్తున్నాయి. బిల్లులు సక్రంగా రాకపోవడంతో బయట వడ్డీలకు డబ్బులు తీసుకొచ్చి సెంటర్‌ల నిర్వహణ చేయాల్సిన దుస్థితి ఉంది. ప్రభుత్వం అంగన్‌ వాడీల సమస్యలను పరిష్కరించాలి.

వేతనం పెంచాలి

శిరిషా, యూనియన్‌ ప్రాజెక్టు నాయకురాలు.

చాలీచాలని వేతనాలతో అంగన్‌ వాడీ కార్యకర్తలుగా పని చేస్తున్నాం. పని ఎక్కువ వేతనం తక్క్వుగా తమ జీవితాలు సాగుతున్నాయి. సెంటర్‌ నిర్వహణతో పాటు గర్బిణులు, బాలింతలకు పౌష్టిక ఆహారం అందిస్తున్నాం. సీఎం ఇచ్చిన హామీ మేరకు అంగన్‌వాడీలకు వేతనాలు పెంచాలి. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలి. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, గ్రాట్యుటీ అమలు చేసి, పని భారాన్ని తగ్గించాలి.

➡️