ఎన్నికలపై బాలయ్య దృష్టి..!

Dec 22,2023 23:04

టిడిపి నేతలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బాలకృష్ణ

     చిలమత్తూరు : సార్వత్రిక ఎన్నికలపై హిందూపురం శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ సాధారణంగా హిందూపురం నియోజకవర్గం పర్యటనకు వస్తే ఆ పార్టీ శ్రేణులు, మీడియాకు ముందస్తు సమాచారం అందుతుంది. తాజాగా శుక్రవారం నాడు ఆయన అకస్మికంగా నియోజకవర్గంకు వచ్చారు. చిలమత్తూరులోని ఓ ప్రయివేటు కేంద్రంలో నియోజకవర్గ నేతలతో పంచాయతీల వారీగా సమావేశాలు ఏర్పాటు చేశారు. దీంతో ఒక్కసారిగా నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంది. కాగా చిలమత్తూరులో వైసిపి రాయలసీమ కన్వీనర్‌, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన మరో రెండురోజుల్లో ఉండనుంది. ఈ నేపథ్యంలో ముందస్తుగా బాలకృష్ణ టిడిపి నాయకులతో పంచాయతీల వారిగా సమీక్ష పెట్టడం ఎన్నికల ఎత్తుగడల్లో భాగంగానే తెలుస్తోంది. మంత్రి పెద్దిరెడ్డి పర్యటనలో వైసిపిలోకి టిడిపి నుంచి పెద్దఎత్తున వలసలు ఉంటాయని ఆపార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ వారి పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి, భవిష్యత్తుపై భరోసా కల్పించే చర్యలకు ఉపక్రమించారనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా టిడిపి నాయకులు తమ పార్టీలోకి వస్తారని వైసిపి భావిస్తుండగా వారి పార్టీకి చెందిన శెట్టిపల్లి పంచాయతీ నాయకుడు హనుమంతరెడ్డి టిడిపిలో చేరారు. ఇది ఒకింత వైసిపి గొంతులో వెలక్కాయపడినట్లు అయ్యింది. ఇక వైసిపిలోకి వెళ్లకుండా టిడిపి నేతలను ఆపడంలో బాలకృష్ణ సక్సస్‌ అయ్యారా.. లేదా..? అన్నది పెద్దిరెడ్డి పర్యటన సందర్భంగా తేలనుంది. ఏదిఏమైనా బాలకృష్ణ సమీక్ష పేరిట అంతర్గత సమావేశం పెట్టడం, మీడియాను కూడా అనుమతించకపోవడం రాజకీయ వ్యూహంలో భాగమనే భావన రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తం అవుతోంది.

➡️