కరెంట్‌ ఆపే’సారూ’..!

Jan 9,2024 10:10

విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో కార్మికులు లేక నిర్మానుష్యంగా ఉన్న ఓ పరిశ్రమ

         హిందూపురం : ఎక్కడైనా…ఎప్పుడైనా ఎదైన శాఖకు సంబందించి మంత్రి, ప్రిన్సిపల్‌ సెక్రటరీలు పర్యటకు వస్తే… ఆ శాఖల అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యి చిన్నచిన్న లోటుపాట్లు ఉంటే వారు రాక ముందే వాటిని సరిచేస్తారు. అయితే హిందూపురంలో ప్రాంతంలో దీనికి విరుద్ధంగా పరిస్థితి ఉంది. రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి పారిశ్రామిక వాడలో పర్యటిస్తుండడంతో ఆ ప్రాంతంలో విద్యుత్‌ శాఖ అధికారులు మరమ్మతుల పేరుతో విద్యుత్‌ను తొలగించారు. పైకి మరమ్మతులు అని చెబుతున్నా, పంచాయతీల వారీగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి పాల్గొంటున్నారని, ఈ సభలకు జనసమీకరణ కోసమే విద్యుత్‌ సరఫరా ఆపే’సారు’.. అనే వార్తలు బలంగా విన్పిస్తున్నాయి. హిందూపురం నియోజక వర్గంలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా వైసిపి జెండా ఎగరవేయాలని సంకల్పించి ఆ పార్టీ రాయలసీమ కో ఆర్డినేటర్‌, విద్యుత్‌ శాఖ మంత్రి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం నుంచి ఆరు రోజుల పాటు నియోజకవర్గ వ్యాప్తంగా సమావేశాలను మొదలు పెట్టారు. అన్ని పంచాయతీల వారీగా సమావేశాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా సోమవారం నాడు చౌళూరు, తూమకుంట, గోళాపురం, కొటిపి, కిరికెర, బేవినహళ్లి పంచాయతీల్లో సమావేశాలను ఏర్పాటు చేశారు. పారిశ్రామిక వాడలో ఉన్న గార్మెంట్స్‌ పరిశ్రమలతో పాటు ఇతర పరిశ్రమల్లో ఉపాధి కోసం జనం వెళ్తారని నాయకులు భావించారు. సమావేశాలకు జన సమీకరణ చేయాలంటే పరిశ్రమలకు సెలవు ఇప్పించాలని అనుకున్నారు. ఇది సాధ్యం కాకపోవడంతో విద్యుత్‌ అధికారుల నుంచి సెలవు ప్రకటించాలని ఒత్తిడి తెచ్చారు. అప్పటికీ పరిశ్రమల యజమానులు వినకపోవడంతో విద్యుత్‌ సరఫరాను నిలిపివేయించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని విద్యుత్‌ శాఖ అధికారులను అడిగితే మరమ్మతుల కారణంగా విద్యుత్‌ సరఫరా నిలపివేశామని చొప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్‌ లేకపోవడంతో ఆ ప్రాంతాల్లో ఉన్న అన్ని పరిశ్రమల నిర్వాహకులు జనరేటర్‌పై ఆధారపడ్డారు. ఒక్క రోజుకు దాదాపు కోటి రూపాయల అదనపు భారం పరిశ్రమల యజమానులపై పడినట్లు తెలుస్తోంది. చిన్న పరిశ్రమల నిర్వాహకులు అదనపు భారాన్ని భరించలేక విద్యుత్‌ కోసం ఎదురుచూశారు. నిత్యం కార్మికులతో కన్పించే పరిశ్రమలు కాస్తా సోమవారం నాడు నిర్మానుష్యంగా మారిపోయాయి.

సభకు గార్మెంట్స్‌ పరిశ్రమ మహిళా కార్మికుల తరలింపు

         హిందూపురం రూరల్‌ మండలం చౌళూరు, తూముకుంట, గోళాపురం, కొటిపి, కిరికెర, బేవినహళ్లి పంచాయతీల్లో వైసిపి సమావేశాలను ఏర్పాటు చేసింది. జన సమీకరణ కోసం స్థానిక నేతలు పారిశ్రామిక వాడలో ఉన్న టెక్స్‌పోర్టు పరిశ్రమకు చెందిన బస్సుల్లోనే మహిళా కార్మికులను తరలించారు.రూ.

కోటి అదనపు భారం

        హిందూపురం రూరల్‌ మండలం తూమకుంట, గోళాపురం పారిశ్రామిక వాడలో దాదాపు 120 వరకు వివిధ పరిశ్రమలు ఉన్నాయి. పరిశ్రమల నిర్వహణకు విద్యుత్‌ సౌకర్యం చాల అవసరం. సోమవారం విద్యుత్‌ శాఖ వారు మరమ్మతుల పేరుతో పారిశ్రామికవాడకు కరెంట్‌ను కట్‌ చేయడంతో పరిశ్రమ నిర్వాహకులకు కోటి రూపాయల వరకు అదనపు భారం పడింది. గత 30 సంవత్సరాలుగా ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు విద్యుత్‌ సరఫరా ఆగిపోయిందని పరిశ్రమల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు.

➡️