కేంద్రానివి వినాశకర పద్ధతులు

Mar 31,2024 22:55

సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఓ.నల్లప్ప

              గుంతకల్లు :కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రెండు రాజ్యాంగబద్ధమైన సిబిఐ, ఈడీ సంస్థలను దుర్వినియోగం చేస్తూ వినాశకర పద్ధతులను అవలంభిస్తోందని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఓ.నల్లప్ప విమర్శించారు. ఆదివారం పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన పార్టీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విరాళాలు పొందడం కోసం బిజెపి రెండు వినాశకర పద్ధతులను అనుసరించడం మంచిది కాదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రకృతి సంపదను కారుచౌకగా కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టడం, ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టడం చూస్తుంటే వినాశకర పద్ధతులు స్పష్టంగా కనిపిస్తాయన్నారు. ‘దాడులు-విరాళాలు’ అనే పద్ధతిని నీతిబాహ్యంగా మేళవించిందన్నారు. అక్రమంగా పొందిన డబ్బుతో ఒకవైపు ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి, ఎన్నికైన ప్రత్యర్థి పార్టీల ప్రభుత్వాలను కూల్చడానికి వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. అందుకే మోడీ పాలనలో 13 రాష్ట్రాల్లో ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాల స్థానంలో బిజెపి పాలిస్తోందన్నారు. మరికొన్ని రాష్ట్రాల్లో అలా పాలించడానికి నిత్యం బెదిరింపులకు తెగబడుతోందన్నారు. మరోవైపు మతం, ధర్మం పేరుతో ప్రజల మధ్య ఐక్యతను విచ్ఛిన్నం చేస్తోందన్నారు. దేశంలో కార్పొరేట్‌ కంపెనీలు, పాలక పార్టీలకు మధ్య రహస్య ఆర్థిక బంధం ఎంత బలంగా పెనవేసుకుందో ఎన్నికల బాండ్ల వ్యవహారం కొంతైనా బట్టబయలు చేసిందన్నారు. నీతి, జాతి, దేశభక్తి, దైవభక్తి లాంటి మాటల గారడీల వెనుక దేశ పాలకులు జరిపిన కుతంత్రాలు సుప్రీంకోర్టు తీర్పుతో కొన్ని వెలుగులోకి వచ్చాయన్నారు. నల్లడబ్బు వెలికితీత, అవినీతి అంతం అనే పదాలకు ఇడి, ఐ.టి దాడులు, సోదాలకు అర్థాలు వేరులే అని రుజువైందన్నారు. దేశ ప్రజలకు వేల ధర్మోపదేశాలు (మన్‌ కీ బాత్‌) చేసిన స్వయం ప్రకటిత విశ్వగురువు ఏలుబడిలో ప్రజాస్వామ్యానికి ఎంత భయంకరమైన చీడ పట్టిందో తేటతెల్లమైందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనం చేయడం, అవినీతిని చట్టబద్దం చేయడం, రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేయడం, దేశ సంపదను కార్పొరేట్‌ సంస్థలకు దోచి పెట్టడమనే బిజెపి దుష్టపన్నాగంలో భాగమే అన్నారు. 2017లో మనీ బిల్లు రూపంలో వచ్చిన ఎలక్టోరల్‌ బాండ్ల విధానం ఆ పార్టీ ఆశించినట్లగానే రూ.వేల కోట్లను సొంతం చేసుకుని ప్రజాస్వామ్య పునాదులను పెకిలించడానికి ప్రయత్నిస్తోందన్నారు. రానున్న ఎన్నికల్లో బిజెపికి బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు డి.శ్రీనివాసులు, బి.శ్రీనివాసులు, పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు దాసరి శ్రీనివాసులు, మారుతీప్రసాద్‌, కసాపురం రమేష్‌, రంగమ్మ, పట్టణ కమిటీ సభ్యులు రామునాయక్‌, ఓబులేష్‌, అబ్దుల్లా, షాషా, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

➡️