చేనేతలకు అండగా టిడిపి : భువనేశ్వరి

చేనేత కార్మికురాలితో మాట్లాడుతున్న భువనేశ్వరి

          ధర్మవరం టౌన్‌ : చేనేతలకు అండగా నిలిచిన పార్టీ టిడిపి అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి చేపట్టిన రాష్ట్ర వ్యాప్త యాత్రలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లాలో 2వ రోజు ఆమె పర్యటించారు. ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లి, ధర్మవరం పట్టణాల్లో బుధవారం పర్యటించి, పలు కుటుంబాలతో మాట్లాడారు. బత్తలపల్లి మండలం సంజీవపురం గ్రామంలో ఏర్పాటుచేసిన మహిళల ఆత్మీయ సమావేశం, ధర్మవరం పట్టణంలో చేనేత కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంజీవపురం గ్రామంలో ముల్లగూరు వెంకటరాముడు, సాకే చెక్కీరయ్య ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తనవంతు సాయంగా ఒక్కొక్కరికి రూ.3లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ధర్మవరం మారుతీరాఘవేంద్రస్వామి కల్యాణమండపంలో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాలశ్రీరామ్‌ ఆధ్వర్యంలో చేనేత మహిళలతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నారా భువనేశ్వరి మాట్లాడుతూ చేనేత పరిశ్రమ అభివద్ధికి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తోందన్నారు. అన్ని రకాల సబ్సిడీలను నేతన్నలకు తెలుగుదేశం ప్రభుత్వంలో అందిచామని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే చేనేతలకు మరిన్ని సంక్షేమపథకాలు అందిస్తారన్నారు. రాష్ట్రానికి మంచి జరగాలంటే జరగాలంటే రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో మహిళలు ఓటు అనే అయుధంతో టిడిపికి మద్దతు తెలిపి వైసిపిని ఓడించాలని పిలుపునిచ్చారు. పరిటాల శ్రీరామ్‌ మాట్లాడుతూ చేనేతలు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకునేందుకు నారాభువనేశ్వరి ధర్మవరం విచ్చేశారన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే చేనేతలను మరింత ప్రోత్సాహం అందించేందుక నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లు కృత నిశ్చయంతో ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ, టిడిపి జిల్లా అధ్యక్షుడు బికె.పార్థసారధి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ, గోనుగుంట్ల విజరుకుమార్‌, పరిటాల జ్ఞాన, బండారు శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

➡️