నిబంధనల మేరకు విధులను నిర్వర్తించాలి

Dec 7,2023 21:21

 సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ అరుణ్‌బాబు

                   పుట్టపర్తి అర్బన్‌ : ఎన్నికల నిర్వహణలో సెక్టార్‌ ఆఫీసర్లు, పోలీసు సెక్టార్‌ ఆఫీసర్లు సమన్వయంతో భారత ఎన్నికల కమిషన్‌ నియమ నిబంధన మేరకు తమ తమ విధులను నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్‌ అరుణ్‌ బాబు తెలిపారు. రాబోయే సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా గురువారం పుట్టపర్తి మండలం బ్రాహ్మణపల్లిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన సెక్టర్‌ ఆఫీసర్లు ,పోలీసు సెక్టర్‌ ఆఫీసర్లకు శిక్షణ తరగతుల కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో పెనుగొండ సబ్‌ కలెక్టర్‌ కార్తీక్‌, ఎఎస్‌పి విష్ణు, డిఆర్‌ఒ కొండయ్య, డీఎస్పీలు, పుట్టపర్తి ఆర్డీవో భాగ్యరేఖ ఇతర ఆర్డీవోలు, మునిసిపల్‌ కమిషనర్లు, సిఐలు ఇతర పోలీస్‌ అధికారులు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ సాధారణ ఎన్నికలు 2024న జరిగే నేపథ్యంలో ముందస్తుగా సెక్టార్‌ ఆఫీసర్లు, సెక్టార్‌ పోలీస్‌ ఆఫీసర్ల కు ఎన్నికల విధుల నిర్వహణకు సంబంధించిన అంశాలపై శిక్షణ ఇస్తున్నామన్నారు. కేవలం పోలీసు యంత్రాంగం తోనే ఎన్నికల నిర్వహణ పూర్తి కాదని, ముఖ్యంగా ఎన్నికల కమిషన్‌ ద్వారా నోటిఫికేషన్‌ జారీ అయినప్పటినుండి ఎన్నికల ప్రక్రియ పూర్తిస్థాయిలో ముగిసే వరకు సెక్టర్‌ ఆఫీసర్ల పాత్ర ఎంతో ముఖ్యమైనదని గుర్తుంచుకోవాలని కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలో 6 నియోజకవర్గాల పరిధిలోని 32 మండలాల్లో 1516 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉన్న సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ఆయా పోలింగ్‌ కేంద్రాలపై గట్టి నిఘా ఉంచాలని కోరారు. ఎస్పీ విష్ణు మాట్లాడుతూ సెక్టర్‌ ఆఫీసర్లు పోలీసు సెక్టార్‌ ఆఫీసర్లు తమకు కేటాయించిన విధులను అంకితభావంతో నిర్వర్తించాలన్నారు. డిఆర్‌ఒ కొండయ్య మాట్లాడుతూ సెక్టర్‌ ఆఫీసర్లు, పోలీసు సెక్టార్‌ ఆఫీసర్లు కలిసి ఎన్నికల నిర్వహణ పనులను చేపట్టాలన్నారు. అనంతరం సెక్టార్‌ ఆఫీసర్లు పోలీసు సెక్టర్‌ ఆఫీసర్ల విధివిధానాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా పలు అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం తహశీల్దార్‌ మైనుద్దీన్‌, నరసింహులు, ఎంఇఒలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

➡️