నీటి ఎద్దడి రానీయొద్దు : కలెక్టర్‌

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ అరుణ్‌బాబు

         ధర్మవరం టౌన్‌ : నీటి పథకాలన్నీ సక్రమంగా పని చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ అరణ్‌బాబు ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయ సమావేశ భవనంలో శనివారం కలెక్టర్‌ తాగునీరు, ఉపాధి పనులపై డివిజన్‌లోని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామీణ, పట్టణాల్లో తాగునీటికి ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటిని ఇతర అవసరాలైన వాహనాలు, ఇంటి తోటలకు వాడరాదన్నారు. వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. గ్రామాల్లో చేతిపంపులకు మరమ్మతులు చేయాలన్నారు. ఉపాధి కూలీలకు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి కొత్తవేతనం అమలు చేసేలా కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఉపాధి కూలి రోజుకు రూ. 300కు పెరిగిన విషయాన్ని కూలీలకు వివరించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించరాదన్నారు. నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. సమావేశంలో ఆర్డీఓ వెంకటశివరామిరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ రాంకుమార్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఈ వెంకటనారాయణ, డ్వామా పీడీ విజయప్రసాద్‌, డివిజన్‌లోని ఎంపిడిఒలు, తహశీల్దార్లు, పాల్గొన్నారు.

➡️