మున్సిపల్‌ కార్మికులను మోసం చేయొద్దు

Feb 6,2024 21:30

కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేస్తున్న మున్సిపల్‌ కార్మికులు

         పుట్టపర్తి అర్బన్‌ : మున్సిపల్‌ కార్మికుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం అంగీకరించిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం మోసం చేస్తే మరో ఆందోళనకు వెళ్లాల్సిన పరిస్థితులు వస్తాయని కార్మికులు హెచ్చరించారు. సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం నాడు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద మున్సిపల్‌ కార్మికులు ధర్నా చేపట్టారు. మున్సిపల్‌ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఎర్రటి ఎండలో బైటాయించి నిరసన కొనసాగించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈఎస్‌.వెంకటేష్‌, లక్ష్మీనారాయణ, జిల్లా కోశాధికారి తిరుపాల్‌, టిఎస్‌.వెంకటేష్‌ మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికుల సమ్మెను విరమించి నెల రోజులు కావస్తున్నా ప్రభుత్వం హామీలకు సంబంధించి జీవోలు జారీ చేయడంలో తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తోందన్నారు. సమ్మె ముగింపు రోజున మూడు రోజుల్లో హామీలపై జీవోలు జారీ చేస్తామని గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌, అధికారులు హామీనిచ్చారని గుర్తు చేశారు. ఇంజినీరింగ్‌ విభాగంలో పని చేస్తున్న 6 వేల మంది మహిళా కార్మికులకు హెల్త్‌ అలవెన్స్‌ హామీ అమలు కాలేదన్నారు. క్లాప్‌ డ్రైవర్లకు చట్ట బద్ధమైన జీత భత్యాలు చెల్లింపులపై జనవరి నెలాఖరులో జాయింట్‌ మీటింగ్‌ ఏర్పాటు చేస్తామని, ఇంతవరకు వేయలేదన్నారు. ఎన్విరాన్‌మెంట్‌ కార్మికులకు రూ.21 వేలు, శానిటేషన్‌ డ్రైవర్‌లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ కార్మికులకు రూ.24,500 వేతనం, విలీన గ్రామ పంచాయతీ కార్మికులను మున్సిపల్‌ కార్మికులుగా గుర్తించి రూ.21 వేలు వేతనం ఇవ్వాలన్నారు. ఇఎస్‌ఐ, పిఎఫ్‌ సమస్యలనూ పరిష్కరించాలన్నారు. రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.75 వేలు, దహన సంస్కారాలకు రూ.20 వేలు, ఎక్స్‌గ్రేషియా సాధారణ మృతికి రూ.2 లక్షలు, ప్రమాద మృతులకు రూ.5 నుంచి రూ. 7 లక్షలకు పెంచాలన్నారు. జిపిఎఫ్‌ అకౌంట్‌లు ప్రారంభించాలన్నారు. క్లీన్‌ ఎన్విరాన్‌మెంట్‌ వర్కర్స్‌కు సంబంధించి సంక్షేమ పథకాలు అమలు తదితర జీవోలు వెంటనే జారీ చేయాలన్నారు. అధికారులకు సమస్యలను తెలిపేందుకు నిరసన తెలుపుతుంటే పోలీసులు ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు చేయడం దుర్మార్గం అన్నారు. ఇలాంటి బెదిరింపు చర్యలతో ఉద్యమాలను ఆపలేరన్న విషయాన్ని ప్రభుత్వం తెలుసుకోవాలన్నారు. అనంతరం డిఆర్‌ఒ కొండయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ యూనియన్‌ నాయకులు రామయ్య, గోవిందు, నాగార్జున, రామంజి, పెద్దన్న, వెంకటేశు, దొడ్డప్ప, ఇంజినీరింగ్‌ కార్మిక సంఘం నాయకులు అనిల్‌, నాగరాజు, రమేష్‌, గణేష్‌, డ్రెయినేజీ కార్మికులు నాగరాజు, పెద్దన్న, ధర్మవరం యూనియన్‌ నాయకులు ముకుంద, చెన్నకేశవులు, మడకశిర యూనియన్‌ నాయకులు బాలు, రామంజి, మల్లేష్‌, శివమ్మ, యల్లమ్మ పాల్గొన్నారు.

➡️