మోగిన ఎన్నికల నగారా

            అనంతపురం ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల నగార మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు షెడ్యుల్‌ను విడుదల చేసింది. నాలుగో దశలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నట్టు ప్రకటించింది. ఇప్పటి నుంచి ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తున్నట్టు తెలిపింది. దీంతో ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా కొనసాగిన వారు తాజా మాజీలు కానున్నారు. రాష్ట్రమంతటా ఒకేసారి ఎన్నికలు కావడంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో నాలుగో దశలోనే పోలింగ్‌ జరగనుంది.

ఏప్రిల్‌ 18న నోటిఫికేషన్‌

ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రకటన మేరకు ఏప్రిల్‌ 18న నోటిఫికేషన్‌ వెలువడనుంది. అప్పటి నుంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి ఉంటుంది. ఏప్రిల్‌ 25వ తేదీతో నామినేషన్ల గడువు ముగుస్తుంది. ఏప్రిల్‌ 26వ తేదీన నామినేన్ల పరిశీలన ఉంటుంది. అప్పటి నుంచి ఏప్రిల్‌ 29వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ పూర్తవుతుంది. అప్పటి నుంచి ప్రచారాలు ప్రారంభమై మే 11వ తేదీ సాయంత్రంతో ప్రచారాలు ముగుస్తాయి. మే 13వ తేదీ పోలింగ్‌ జరగనుంది. జూన్‌ 4వ తేదీన ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగనుంది.

అమల్లోకి ఎన్నికల కోడ్‌

          ఎన్నికల షెడ్యుల్‌ వెలువడినప్పటి నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందని ఎన్నికల సంఘం తెలిపింది. రాజకీయ పార్టీల ప్లెక్సీలు, పొటోలను తొలగించాలని సూచించింది. అదే విధంగా ఆన్‌లైన్‌లో ఉన్న మంత్రులు ముఖ్యమంత్రుల చిత్రాలను తొలగించాలని పేర్కొంది. రాజకీయపరమైన కార్యక్రమాల్లో అధికారులు ఎవరైనా పాల్గొంటే చట్టపరమైన చర్యలుంటాయని కూడా హెచ్చరించింది.

➡️