మౌనంగా ‘మేమంతా సిద్ధం’..!

ప్రజలకు నమస్కరిస్తున్న వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి

           అనంతపురం ప్రతినిధి : ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఉమ్మడి అనంతపురం జిల్లాలో ముగిసింది. శనివారం నాడు కర్నూలు జిల్లా తుగ్గలి నుంచి ప్రారంభమైన ఆయన యాత్ర అదే రోజు మధ్యాహ్నం గుత్తి మండలంలోకి ప్రవేశించింది. గార్లదిన్నె, అనంతపురం మీదుగా రాప్తాడు నుంచి సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం సంజీవపురం వరకు సాగింది. ఆదివారం నాడు యాత్రకు విరామం ఇవ్వడంతో అక్కడే బస చేశారు. సోమవారం ఉదయం సంజీవపురం నుంచి ప్రారంభమైన యాత్ర బత్తలపల్లి, ముదిగుబ్బ, నాగారెడ్డిపల్లి మీదుగా రాత్రికి కదిరి చేరుకుంది. అక్కడి నుంచి రాత్రికి అన్నమయ్య జిల్లా చీకటిమానుపల్లి వద్ద ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి బస చేశారు. అక్కడికి చేరుకునే సరికి సమయం చాలా ఆలస్యమైంది. బత్తలపల్లి, ముదిగుబ్బ, కదిరి పట్టణాల్లో భారీ జనసందోహం నెలకొంది. పెద్దపెద్ద గజమాలలతో ముఖ్యమంత్రికి భారీ పెద్దఎత్తున స్వాగతాలు పలికారు. భారీ జనందోహం నడుమ నిర్ణీత సమయం ప్రకారం పర్యటనలు సాగలేదు. రెండు,మూడు గంటలు ఆలస్యంగానే రెండు రోజుల పర్యటనలు సాగాయి. ఈ ఆలస్యం కారణంగా కదిరిలో ఇప్తార్‌ విందుకు కూడా సాయంత్రం ఐదు గంటలకు రావాల్సింది రాత్రి ఎనిమిది గంటలకు వెళ్లారు.

మౌనంగా ముగిసిన పర్యటన

        ఎన్నికల సమయం కావడంతో ముఖ్యమంత్రి పర్యటనలో వాడీవేడి ప్రసంగాలుంటాయని అందరూ భావించారు. ప్రతిపక్షాలపై విమర్శలతోపాటు, ఐదేళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమం గురించి పెద్దఎత్తున ప్రజలకు వివరిస్తారని అందరూ భావించారు. కాని ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్లు, శింగనమల, అనంతపురం, రాప్తాడు, ధర్మవరం, కదిరి నియోజకవర్గాల్లో పర్యటించినా ఎక్కడా ఎటువంటి ప్రసంగాలూ లేకుండా సాగాయి. ప్రజలకు అభివాదాలు చేస్తూ అవకాశమున్న చోట సామాన్య జనాన్ని కలుస్తూ యాత్రను ముగించారు. ఎన్నికల సందర్భంగా ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన హామీలు కూడా ఏవీ లేకుండానే సాగాయి. దీంతో ఆయన పర్యటనపై ప్రతిపక్షాలు ప్రతి విమర్శలు చేయడానికి పెద్దగా అవకాశం లేకుండా సాగింది.

ఇద్దరు ముఖ్య నేతలు వైసిపిలో చేరిక

            ముఖ్యమంత్రి చేపట్టిన మేమంతా సిద్ధం యాత్ర సందర్భంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇద్దరు ముఖ్య నేతలు టిడిపిని వీడి వైసిపిలో చేరారు. అందులో కళ్యాణదుర్గం టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఒకరు కాగా, కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌ బాషా మరొకరు. టిక్కెట్లు ఆశించి రాకపోవడంతో ఈ ఇద్దరు నేతలు పార్టీని మారారు. వీరితోపాటు మాజీ ఎంపిపి, జడ్పిటిసిలు ఇతర నాయకులు మరికొంత మంది పార్టీలో చేరారు.

➡️