రాష్ట్రవ్యాప్తంగా ఉచిత కాన్సర్‌ వైద్యశిబిరాలు

Mar 3,2024 22:16

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బాలకృష్ణ

                      హిందూపురం : బసవతారక ఇండో అమెరికన్‌ కాన్సర్‌ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత కాన్సర్‌ మొబైల్‌ వైద్యశిబిరాలు నిర్వహిస్తామని స్థానిక ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. హిందూపురంలోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్‌ నిర్ధారణ వైద్య శిబిరాన్ని బాలకృష్ణ ఆదివారం సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తల్లి మరణాంతరం ఆమె జ్ఞాపకార్థకంగా బసవతారక ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌ ను తన తండ్రి నందమూరి తారక రామరావు స్థాపించారన్నారు. తన తండ్రి స్ఫూర్తితో క్యాన్సర్‌ హాస్పిటల్‌ నిర్వహిస్తు, ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తున్నామని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యాధునిక పరికరాలతో కూడిన మొబైల్‌ వాహనాన్ని తయారు చేయడం జరిగిందన్నారు. నూతన ఉచిత మొబైల్‌ క్యాన్సర్‌ నిర్ధారణ వాహనాన్ని హిందూపురం నుంచే ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. పేదవారికి తమ ఆసుపత్రిలో ఉచిత సేవలు అందించడంతో పాటు రాయితీతో కూడిన వైద్య సేవలందిస్తామన్నారు. స్వచ్చంద సంస్థలు, వైద్యులు ముందుకు వస్తే రాష్ట్రవ్యాప్తంగా మొబైల్‌ ఉచిత క్యాన్సర్‌ నిర్ధారణ వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే హిందూపురం నియోజక వర్గంలో గత సంవత్సరం నుండి ఎన్టీఆర్‌ మొబైల్‌ చైతన్య రథం వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తున్నామన్నారు. ఎన్టీఆర్‌ ఆరోగ్య రథం నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని సందర్శించి వైద్య సేవలు అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ అసుపత్రి వైద్యులు సుధాకర్‌, శ్రావణి కుమారి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్‌. సురేంద్ర, టీడీపీ కోఆర్డినేటర్‌ శ్రీనివాసరావు, అంబికా లక్ష్మినారాయణ, రమేష్‌ కుమార్‌ తో పాటు టిడిపి నాయకులు, వైద్యులు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

➡️