సరిదిద్దలేని పొరపాటు…

Mar 5,2024 21:49

గ్రామస్తులు, పూర్వ విద్యార్థులతో మాట్లాడుతున్న అధికారులు

                     చిలమత్తూరు : శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పది పరీక్ష కేంద్రాన్ని ప్రయివేటు పాఠశాలకు తరలించడంలో సరిదిద్దలేని పొరపాటు జరిగిందని సప్లిమెంటరీ నుంచి పరీక్షలు ప్రభుత్వ పాఠశాలలోనే నిర్వహిస్తామని ఇందుకు గ్రామస్తులు సహకరించాలని ఎంఇఒ సల్మాన్‌రాజ్‌ కోరారు. పది పరీక్షకేంద్రం మార్పుపై మండలంలో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. ఈ నేపధ్యంలోనే మంగళవారం ఆందోళన చేసేందుకు పూర్వ విద్యార్థులు పిలుపు నివ్వడంతో మరోసారి మండల విద్యాశాఖ అధికారులు పూర్వ విద్యార్థులతో చర్చలకు పిలిచి సామరస్యంగా సమస్య పరిష్కరించడానికి చర్యలు చేపట్టారు. ఇందుకు ఎస్‌ఐ గంగాధర్‌ చొరవ చూపడంతో చర్చలు జరిగాయి. ఈ మేరకు మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంఇఒ సల్మాన్‌రాజ్‌ మాట్లాడుతూ హెచ్‌ఎం తెలియనితనం వల్ల సెంటర్‌ వద్దని చెప్పడం, డ్యూయల్‌ డెస్క్‌ లు లేవని చెప్పడం వల్ల సెంటర్‌ మార్చారని చెప్పుకొచ్చారు. ఇక్కడ తప్పు జరిగిపోయిందని,ఇప్పుడు దానిని సరిచేసే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. పరీక్ష కేంద్రం ప్రయివేటు పాఠశాల అయినప్పటికి విద్యార్థులకు అనుకూలంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. ప్రయివేటు పాఠశాలకు చుట్టూ ప్రహారీ కూడా లేదని ఎలా రెండు సెంటర్లు ఇస్తారని పూర్వ విద్యార్థులు ఎంఇఒను నిలదీశారు. దీంతో ఎంఇఒ మాట్లాడుతూ పొరపాటు జరిగిందని అన్నారు. పరీక్ష కేంద్రంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చుట్టు బారికేట్లు ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే విద్యార్థులకు అనుకూలంగా బస్సులు,కనీస వసతులు, అక్కడే మెడికల్‌ క్యాంప్‌ ఏర్పాటు చేయడంతో పాటు తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ పొరపాటును వచ్చే సప్లమెంటరీ పరీక్షల నుండే సరిదిద్ది ప్రభుత్వ పాఠశాలలోనే పరీక్ష కేంద్రం నిర్వహిస్తామని హామి ఇవ్వడంతో పూర్వ విద్యార్థులు అంగీకరించారు. ఇక విద్యార్థులకు పరీక్ష ప్రయివేటు కేంద్రంలో అన్న భయం పోగొట్టేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ -1 పద్మప్రియ ఎంఇఒ -2 సల్మాన్‌ రాజ్‌, పూర్వ విద్యార్థులు అలీముల్లా, బాలాజీ, సుబ్రమణ్యం, రవికుమార్‌, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

➡️