ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీ చర్యలు : కలెక్టర్‌

కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలన చేస్తున్న జిల్లా కలెక్టర్‌

        హిందూపురం : ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ అరుణ్‌ బాబు ఆదేశించారు. శనివారం లేపాక్షిలోని డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ గురుకుల పాఠశాల, హిందూపురం రూరల్‌ మండలం గుడ్డంపల్లి వద్ద ఉన్న బిట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌లను, కౌంటింగ్‌ కేంద్రాలను, భధ్రతాచర్యలను కలెక్టర్‌ పి.అరుణ్‌ బాబు, జిల్లా ఎస్‌పి మాధవరెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు అన్నీ ముందస్తుగానే పూర్తిచేయాలన్నారు. కౌంటింగ్‌ కేంద్రంలోకి అధికారులు, అభ్యర్ధులు, వారి ఏజెంట్లు వెళ్లేందుకు బారీకేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఓట్ల లెక్కింపు కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లన్నీ సంబంధిత రిటర్నింగ్‌ అధికారులు పర్యవేక్షిస్తూ త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కౌంటింగ్‌ హాలులోకి సెల్‌ ఫోన్స్‌, ఇతర ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌ వంటివి అనుమతించరాదని. గుర్తింపు కార్డు లేకుండా ఎవరినీ అనుమతించరాదన్నారు. కౌంటింగ్‌ సిబ్బంది ఏర్పాట్లకు సంబందించి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం ఆయా నియోజకవర్గాల కౌంటింగ్‌ హాళ్లను కలెక్టర్‌ పరిశీలించి పలు సూచనలు చేశారు. కంట్రోల్‌ రూమ్‌ ను తనిఖీచేసి ఈవిఎంల భధ్రతను పరిశీలించారు. లేపాక్షి గురుకుల పాఠశాల నందు డార్మెంటు బ్లాక్‌ నందు మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సంబంధిత రిటర్నింగ్‌ అధికారులను ఆదేశించారు. పోస్టల్‌ బ్యాలెట్‌కు సంబంధించిన టేబుల్స్‌ ను పరిశీలించి సంబంధిత అధికారులకు ప్రత్యేక సూచనలు చేశారు. బిట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఆవరణలో మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సంబంధిత రిటర్నింగ్‌ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సాధారణ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియను నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టడం చేయాలన్నారు. స్ట్రాంగ్‌ రూముల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని, కౌంటింగ్‌ కోసం కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. బిట్‌ కళాశాల, లేపాక్షి గురుకుల పాఠశాల ప్రధాన ద్వారం వద్ద బందోబస్తు పటిష్టంగా కొనసాగించాలని, 24/7 బందోబస్తు నిర్వహించాలన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. కౌంటింగ్‌ కోసం భద్రత, బ్యారికేడింగ్‌ ఏర్పాట్లు ముందస్తుగానే పూర్తిచేయాలని, నిరంతరం నిఘా ఉంచాలన్నారు. కౌంటింగ్‌ ప్రశాంతంగా నిర్వహించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డి ఆర్‌ ఓ పి కొండయ్య, ఆర్‌ ఓలు పుట్టపర్తి భాగ్యరేఖ, ధర్మవరం వెంకట శివ సాయి రెడ్డి, మడకశిర గౌరీ శంకర్‌, డీఎస్పీలు, నియోజకవర్గ సహాయ ఎన్నికల అధికారులు, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

➡️