డ్రోన్లకు డిమాండ్‌..!

           అనంతపురం ప్రతినిధి : ఒకవైపు ఎన్నికలు, మరోవైపు పెళ్లిల సీజన్‌ కావడంతో ఫొటో, వీడియో గ్రాఫర్లతోపాటు డ్రోన్లకు పెద్దఎత్తున డిమాండ్‌ ఏర్పడింది. జిల్లాలో ఇవి దొరక్కపోవడంతో బయట నుంచి కూడా తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో వాటి బాడుగ ధరలు కూడా మూడింతలకుపైగా పెరిగాయి. అంత పెరిగినా దొరకడం కూడా సమస్యగానే ఉంది. 300కుపైగా డ్రోన్లు బుక్‌ ప్రత్యేకమైన సందర్భాల్లో జరుగుతున్న ఘటనలను చిత్రీకరణ చేయడానికి ఫొటోలు, వీడియోలతోపాటు, ఇప్పుడు డ్రోన్ల ద్వారా చిత్రీకరణ పెరిగింది. జ్ఞాపకాలుగా దీన్ని పదిలపరచుకోవడానికి చిత్రీకరించడం జరుగుతూ ఉంటుంది. మంగళవారం నాడు జిల్లాలో పెద్దఎత్తున ఎన్నికల నామినేషన్లు, పెళ్లిళ్లు ఉన్నాయి. వీటిని చిత్రీకరించేందుకు డ్రోన్లు పెద్దఎత్తున బుక్‌ అయ్యాయి. అనంతపురం జిల్లాలో ఏకంగా 300లకుపైగా డ్రోన్లు బుక్‌ అయినట్టు అనధికారిక అంచనా. వీటికి బాడుగలు కూడా ఇంతక ముందు వరకు రూ.6000 రోజుకు ఉన్నది ఇప్పుడు రూ.30 వేల వరకు పెరిగింది. ఇంత ధరను చెల్లించి అయినా వాటిని బాడుగకు తీసుకుంటూ ఉండటం గమనార్హం.

నేడు భారీ ఎత్తున నామినేషన్లు

        ఉమ్మడి అనంతపురం జిల్లాలో నేడు పెద్దఎత్తున నామినేషన్లు దాఖలు కానున్నాయి. అనేక నియోజకవర్గాల్లో భారీ జనసమీకరణతో నామినేషన్లు దాఖలు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారీగా నామినేషన్లు వేస్తున్న నాయకులు చూసినప్పుడు ఉరవకొండలో టిడిపి అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ వేయనున్నారు. రాయదుర్గంలో కాలవ శ్రీనివాసులు, శింగనమలలో బండారు శ్రావణిశ్రీ నామినేషన్లు భారీగా వేయనున్నారు. అనంతపురం టిడిపి అభ్యర్థి దగ్గుపాటి వెంకట ప్రసాద్‌, పార్లమెంటు అభ్యర్థి అంబికా లక్ష్మినారాయణ పెనుకొండలో సవితమ్మ, తాడిపత్రిలో వైసిపి అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి తదితరులు నామినేషన్లు వేయనున్నారు. ఈ జనసమీకరణకు కూడా డ్రోన్లను బుక్‌ అయినట్టు తెలుస్తోంది.

ఫొటో, వీడియో కెమెరాలకూ డిమాండే

        ఫొటో, వీడియో కెమెరాలకు విపరీమైన డిమాండ్‌ ఏర్పడింది. ఎన్నికలు, పెళ్లిళ్లు రెండు కలసి రావడంతో వీటిని ముందుగానే బుక్‌ చేసుకున్నారు. ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. బాడుగ ధరలు అమాంతంగా పెరిగాయి. ముఖ్యంగా నామినేషన్ల కవరేజీకి కోసం ప్రత్యేకంగా కొంతమంది కొత్త కెమెరాలను సైతం కొనుగోలు చేసినవారున్నారు. తమకంటే ఒక కెమెరామెన్లను పూర్తి ఎన్నికల వరకు నియమించుకుని ఎక్కడికెళ్లినా తీసే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

➡️