అధికారుల్లో గుబులు..!

            అనంతపురం ప్రతినిధి : ఎన్నికల ప్రక్రియలో ఏ మాత్రం తప్పు చేసినా అధికారులపై వేటు పడుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఒకరి తరువాత ఒకరిపై వేటు పడుతూనే ఉంది. ఓటర్ల జాబితా తయారీ మొదలు ఓటింగ్‌ పూర్తయ్యే వరకు అధికారులపై వేటు పడిన ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. ఓటర్ల జాబితాలో తప్పులు చేసారన్న దానిపై ఇది వరకే ఇద్దరు జిల్లా అధికారులపై వేటు పడింది. ఉరవకొండ నియోజకవర్గం పరిధిలో ఓటర్లను దురుద్ధేశంతో తొలగించారన్న ఆరోపణలపై అధికార వైసిపి, ప్రతిపక్ష టడిపిలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడమే కాకుండా ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందజేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఎన్నికల సంఘం ఇద్దరు జిల్లా ఉన్నతాధికారులపై వేటు వేసింది. జిల్లా పరిషత్‌ సిఇఒలు స్వరూప రాణి, భాస్కర్‌రెడ్డిలపై వేటు వేశారు. వీరే కాకుండా విఆర్‌ఎలపైనా వేటుపడింది. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తరువాత అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారన్న ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్‌ గౌతమి, ఎస్పీ అన్బురాజన్‌లపైనా బదిలీ వేటు పడింది. ఇక కొత్త అధికారులు కాబట్టి సజావుగా ఎన్నికలు సాగుతాయని అనుకున్నారు. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యాక డీఎస్పీ రాఘవరెడ్డిని బాధ్యతల నుంచి తప్పించారు. తాడిపత్రిలో మూడు రోజులపాటు ఎన్నికల సమయంలో ఘర్షణ చోటు చేసుకోవడంతో ఏకంగా జిల్లా ఎస్పీ అమిత్‌ బర్దర్‌ బదిలీకావల్సి వచ్చింది. డిఐజి అమ్మిరెడ్డి సైతం బదిలీ అయ్యారు. ఆయన్ను సస్పెండ్‌ చేయడమే కాకుండా విచారణకు ప్రత్యేక బృందాన్ని నియమించారు. ఈయనతోపాటు తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, సిఐ మరళీకృష్ణపైనా వేటు పడింది. ఈ వేటు ఇంకా మరికొంత మంది కింది స్థాయి అధికారులపైనా వేటు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రత్యేక విచారణ బృందం రెండు రోజులుగా తాడిపత్రిలో మకాం వేసి పూర్తి స్థాయి విచారణను చేపట్టింది. ఈ విచారణ నివేదిక ఆధారంగా కేసులు కూడా ఉండే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇలా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఒకరి తరువాత ఒకరిపై వేటు పడుతూనే వస్తోంది. ఎన్నికల ప్రక్రియ ఇంకా తుది ఘట్టం ఉండనే ఉంది. ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. అది వచ్చాక జిల్లాలో చోటు చేసుకునే పరిణామాలు ఉండనున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో అధికారుల్లో గుబులు నెలకొంది. ఎక్కడ ఏ తప్పు జరిగితే చర్యలుంటాయోనని భయపడిపోతున్నారు. ఇప్పుడు జిల్లా కలెక్టర్‌ మొదలు డిఐజి, ఎస్పి అంతా కొత్తవారే వచ్చారు. ఎన్నికల ఫలితాల అనంతరం పరిణామాలను ఈ కొత్త అధికార యంత్రాంగం ఏ రకంగా వ్యవహరించనుందన్నది చూడాల్సి ఉంది. ఏ మాత్రం చిన్న తప్పు జరిగినా ఇబ్బందులు పడుతామని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే జిల్లాలో పది మంది అధికారులు ఈ రకమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నువ్వా..నేనా అన్నట్టుగా సాగిన ఈ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఉన్నారు. ఈ పోరులో నలుగుతున్నది మాత్రం అధికారులే. మొత్తం మీద అడకత్తెరలో పోకచెక్కలాగా తయారయ్యింది వీరి పరిస్థితి.

➡️