ఎన్నికల విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు : కలెక్టర్‌

ఎన్నికల సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్‌ అరుణ్‌బాబు

          పెనుకొండ రూరల్‌ : ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలని అలా కాకుండా నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు హెచ్చరించారు. గురువారం సాయంత్రం పెనుకొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పెనుకొండ-158 నియోజకవర్గ పరిధిలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ప్రిసిడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసిడింగ్‌ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నిష్పక్షపాతంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల విధులను నిర్వహించాలన్నారు. ఎన్నికల విధుల నిర్వహణలో ఎలాంటి సందేహాలు ఉన్నా వాటిని తెలుసుకునేలా శిక్షణ తరగుతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోలింగ్‌ జరిగే ముందురోజు 12వ తేదీ ఉదయం 8 గంటలకు ఎన్నికల మెటీరియల్‌ డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రానికి చేరుకోవాలన్నారు. పోలింగ్‌ కేంద్రంలో అవసరమైన పోలింగ్‌ సామగ్రిని చెక్‌ లిస్ట్‌ ప్రకారం జాగ్రత్తగా తీసుకుని పోలింగ్‌ విధులకు హాజరుకావాలన్నారు. పోలింగ్‌ ముగిసిన రోజు సాయంత్రం బాధ్యతగా ఈవీఎంలు, పీవో డైరీ ఇతర వాటిని రిసీవింగ్‌ సెంటర్‌ కు అప్పగించాలన్నారు. పోలింగ్‌ కేంద్రంలో ఓటింగ్‌ సరళి సజావుగా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లను ముందస్తుగా ప్రణాళిక బద్దంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. పోలింగ్‌ రోజు ఉదయం 5 గంటలకు పోలింగ్‌ ఏజెంట్ల నుంచి ఫారం-10 తీసుకుని వారిని లోక్‌సభ, అసెంబ్లీకి వేరువేరుగా ఏర్పాటు చేయాలన్నారు. అదే ఫారంలో అభ్యర్థి, ఎలక్షన్‌ ఏజెంట్‌ సంతకాన్ని సరిచూసుకోవాలన్నారు. ఎన్నికల విధుల్లో ఎలాంటి ఒత్తిళ్లకు ఆందోళనకు గురికావద్దని, విధుల పట్ల చిత్తశుద్ధి కలిగి ఉండాలని కలెక్టర్‌ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 12వేల మంది దాకా ఎన్నికల సిబ్బంది విధులకు హాజరుతున్నట్లు తెలిపారు. అనంతరం ఈవీఎంల పనితీరు అవగాహనను జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. అంతకుముందు శిక్షణలో భాగంగా పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా పోలింగ్‌ కేంద్రంలో ఓటింగ్‌ విధానంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ రిటర్నింగ్‌ అధికారి, సబ్‌ కలెక్టర్‌ అపూర్వ భరత్‌, మున్సిపల్‌ కమిషనర్‌ వంశీకృష్ణ భార్గవ, పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గం తహశీల్దార్లులు పీవోలు, ఏపీవోలు, మాస్టర్‌ ట్రైనర్లు పాల్గొన్నారు.

➡️