విధులలో అలసత్వం వహిస్తే చర్యలు : ఎస్పీ

May 12,2024 21:37

పోలీసులకు సూచనలు చేస్తున్న ఎస్పీ

                       పుట్టపర్తి రూరల్‌ : జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగే విధంగా సర్వం సిద్ధం చేశామని పోలీసులు విధినిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవ్‌ రెడ్డి హెచ్చరించారు. జిల్లాలోని ఆయా నియోజక వర్గాలలో గల అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లు చేపట్టామన్నారు. ప్రశాంతంగా ఎన్నికల నిర్వహించడమే తమ లక్ష్యమని ఇందుకోసం కేంద్ర సాయుధ బలగాలతో పాటు జిల్లా పోలీస్‌ యంత్రాంగం పనిచేస్తుందని అన్నారు. పోలింగ్‌ జరుగుతున్న సమయం లో అప్రమత్తంగా ఉంటూ, వృద్ధులు, వికలాంగులు, మహిళలు స్వేచ్చగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తోడ్పడాలని తెలిపారు. జిల్లాలో 1873 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా, ఇందులో 299 సమస్యాత్మకమైన పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయన్నారు. అక్కడ మరింత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు.పోలింగ్‌ బూత్‌ల దగ్గర ఓటర్లు , ప్రజలు గుంపులు, గుంపులుగా ఉండకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించామని, బారికేడింగ్‌ ఉండే విదంగా సంబందిత అదికారులతో సమన్వయం చేసుకొని వెళ్లాలని చెప్పామన్నారు. పోలింగ్‌ కేంద్రానికి 100 మీటర్ల లోపల ఎవరూ గుంపులుగా ఉండకుండా చర్యలు తీసుకోవాలని, ఎన్నికలతో సంబంధంలేని వ్యక్తులను పోలింగ్‌ బూత్‌లలోకి అనుమతించబడదని, విధులలో ఉన్నవారు తప్పనిసరిగా మంజూరు చేసిన అనుమతి పాసును దగ్గర పెట్టుకోవాలని చెప్పారు. జిల్లాలోని అన్నీ సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద కేంద్ర సాయుధ బలగాలను కేటాయించడం జరిగిందని,ఈ ఎన్నికలకు 13 కంపెనీల సిబ్బంది వచ్చారని అన్నారు. ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎన్నికల పక్రియను అంతా సిసి కెమెరాలతోను, సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్‌ కెమెరాలు, వీడియో కెమెరాలతో చిత్రీకరణకు ఏర్పాట్లు చేశామన్నారు. ఏదైనా అనుకోనిసంఘటన జరిగితే వెంటనే ఉన్నత అధికారులకు సమాచారం అందించాలన్నారు. కమాండ్‌ కంట్రోల్‌ ద్వారా నిత్యం పర్యవేక్షణ..పోలింగ్‌ జరుగుతున్న కేంద్రాలలో సమస్యలు తలెత్తిన వెంటనే చర్యలు తీసుకోవడానికి కమాండ్‌ కంట్రోల్‌ ద్వారా పర్యవేక్షణ ఏర్పాటు చేపట్టామన్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎన్నికల నిమిత్తం కంట్రోల్‌ ద్వారా సిబ్బందిని ఏర్పాటు చేసి పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ద్వారా నిత్యం అక్కడ ఏ సమస్య తలెత్తిన వెంటనే తెలుసుకునే విధంగా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే అక్కడికి ప్రత్యేక టీములు చేరుకునే విధంగా ఈ కమాండ్‌ కంట్రోల్‌ పనిచేస్తుందన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద జరిగే సమస్యలు ఎప్పటికప్పుడు సిబ్బంది అప్రమత్తంగా ఉండి తెలుసుకోవాలని సిబ్బందికి సూచించినట్లు ఎస్పీ చెప్పారు. సైబర్‌ సెల్‌ సిఐ హేమంత్‌ కుమార్‌ ఆధ్వర్యంలో కమాండ్‌ కంట్రోల్‌ ద్వారా నిత్యం పర్యవేక్షణ చేసే విధంగా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు ఎఆర్‌ డిఎస్‌పి విజరు కుమార్‌, ఎస్‌బి సిఐ బాలసుబ్రమణ్యం రెడ్డి , సిసి రాఘవేంద్ర, ఆర్‌ఐలు చంద్రశేఖర్‌, వలి, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️