బిల్లుల జాప్యంపై విచారణ

కమిషనర్‌ ఛాంబర్‌లో జరిగిన సంఘటనపై గుత్తేదారులతో విచారణ చేస్తున్న జిల్లా ఆడిట్‌ అధికారి

         హిందూపురం : హిందూపురం పురపాలక సంఘంలో బిల్లుల జాప్యంపై గుత్తేదారులు ఆందోళన కార్యక్రమాలు, బిల్లుల జాప్యానికి కారణాలపై ప్రజాశక్తి ప్రత్యేక కథనాలను వెలుగులోకి తీసుకొచ్చింది. దీనిపై సమగ్ర విచారణ జరపాలని మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌ రెడ్డి జిల్లా ఆడిట్‌ అధికారి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం జిల్లా ఆడిట్‌ అధికారి వెంకట శివా రెడ్డి, సహాయ ఆడిట్‌ అధికారులతో కలిసి విచారణ జరిపారు. బిల్లులు ఎప్పుడు సిఎఫ్‌ఎంఎస్‌లో పొందుపరిచారు. ఎన్ని పనులకు సంబందించిన బిల్లులు ఉన్నాయి. తదితర విషయాలను సమగ్రంగ పరిశీలన చేశారు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌ రెడ్డి సమక్షంలో గుత్తేదారులతో జరిగిన సంఘటనపై విచారణ చేశారు. ఈ సందర్బంగా గుత్తేదారులు పురపాలక సంఘంలో 15 మంది గుత్తేదారులు గత 8 నెలల కాలంగా అప్పులు చేసి దాదాపు రూ.3కోట్ల అభివృద్ధి పనులు చేశామన్నారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని కోరుతున్నప్పటికి అకౌంట్స్‌ విభాగం వారు ఒకరిపై ఒకరు వేసుకుంటు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు.బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుల ఊబిలో కూరకుపోయామని గుత్తేదారులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పురపాలక సంఘాల్లో బిల్లులు మంజురైనా ఇక్కడ మాత్రం ప్రీ ఆడిట్‌ అధికారి రవి శంకర్‌ నిర్లక్ష్యం వల్ల అందరం రోడ్డున పడ్డామన్నారు. అనంతరం జిల్లా ఆడిట్‌ ఆధికారి వెంకట శివారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ హిందూపురం పురపాలక సంఘంలో జరిగిన బిల్లుల జాప్యంపై సమగ్రంగా విచారణ జరిపి, నివేదికను ఉన్నాతాధికారులకు అందజేస్తామన్నారు. ప్రీ ఆడిట్‌ అధికారుల నిర్లక్ష్యం అని తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

➡️