లైంగిక వేధింపుల ఘటనపై ఎమ్మెల్యే సీరియస్‌

Jun 27,2024 21:54

ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేస్తున్న వైద్యసిబ్బంది

                   చెన్నేకొత్తపల్లి : చెన్నేకొత్తపల్లి మండలంలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల అంశంపై ఎమ్మెల్యే పరిటాల సునీత సీరియస్‌ అయ్యారు. ఎన్‌ఎస్‌ గేటు ప్రాథమిక ఆస్పత్రి వైద్యులు ఉదరు ఎఎన్‌ఎంలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అంశం ఇప్పటికే జిల్లాలో కలకలం రేపింది. డాక్టర్‌ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆస్పత్రికి సంబంధించిన పలువురు ఏఎన్‌ఎంలు పుట్టపర్తిలో డిఎంహెచ్‌ మంజులవాణికి ఫిర్యాదు చేశారు. దీంతో వైద్యుల కమిటీ గురువారం ఎన్‌ఎస్‌ గేట్‌ ఆస్పత్రికి చేరుకుని విచారణ చేపట్టింది. తాజాగా ఎఎన్‌ఎంలు ఈ అంశాన్ని మాజీ మంత్రి పరిటాల సునీత దృష్టికి తీసుకొచ్చారు. వైద్యుడు చేసిన వాట్సప్‌ చాట్‌ను సునీతకు చూపించారు. సాక్షాలు ఉన్నా వైద్యుడిపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించడంపై పరిటాల సునీత సీరియస్‌ అయ్యారు. వెంటనే డాక్టర్‌ ఉదరు పై చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్‌ఒకు సూచించారు. మహిళల పట్ల ప్రభుత్వ కార్యాలయాల్లోనే ఇలాంటి వేధింపులు ఉంటే ఇక బయట పరిస్థితి ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని తమ ప్రభుత్వం క్షమించే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. ఎఎన్‌ఎంలకు ధైర్యం చెప్పి.. కచ్చితంగా చర్యలు ఉంటాయని భరోసా ఇచ్చారు.

➡️