హామీల ఊసేలేదు..!

బహిరంగ సభలో ప్రసంగిస్తున్న జగన్మోహన్‌రెడ్డి

        హిందూపురం : హిందూపురం నియోజక వర్గ అభివృద్ధి కోసం నూతనంగా ఇచ్చిన హామీలు లేవు.. గతంలో ఇచ్చిన హామీలపై కనీసం ప్రసత్తవాన లేకుండానే ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి సభ ముగిసింది. ఎన్నికల ప్రచార సభలో భాగంగా శనివారం ఉదయం వైసిపి ఆధ్వర్యంలో బహిరంగ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగన్మోహన్‌రెడ్డి హాజరై ప్రసంగించారు. తన ప్రసంగంలో 2019లో హిందూపురం అభివృద్ధికి ఇచ్చిన హామీలు, కొత్త వాటిపై కనీస ప్రస్తావన కూడా చేయలేదు. అధికారంలోకి వస్తే పురం కోసం చేసే అభివృద్ధి పనులపైనా మాటమాత్రమైనా హామీలు ఇవ్వలేదు. తన ప్రసంగం మొత్తం చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేదల సంక్షేమం కోసం ఒక్క పథకం కూడా తీసుకురాలేదన్నారు. బాబు అధికారంలో ఉన్న సమయంలో పేదల ఖాతాల్లోకి ఒక్క రూపాయి వేసిన దాఖలాల్లేవన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో ఏకంగా 130 సార్లు బటన్‌ నొక్కి రూ.2.70 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వేశామన్నారు. ఇదే డబ్బు చంద్రబాబు హయాంలో ఎవరి జేబులోకి వెళ్లిందో జనం తెలుసుకోవాలన్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ గురించి చంద్రబాబు వాస్తవాలు తెలుసుకోకుండా ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. భూమిపై రైతులకు సంపూర్ణ హక్కులు కల్పించేందుకు ఈ చట్టాన్ని తెచ్చామన్నారు. ఎటువంటి వివాదం లేని టైటిల్‌ ప్రతి ఒక్కరికీ ఇవ్వాలన్నదే తన లక్ష్యం అన్నారు. జగన్‌ భూములు ఇచ్చేవాడే కానీ.. లాక్కునే వాడు కాదన్నారు. రూ. 2.70 లక్షల కోట్ల విలువైన సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు 231 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చిన ఘనత వైసిపి ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఇలాంటి పరిపాలనను ప్రజలు మరోసారి ఆశీర్వదించాలన్నారు. హిందూపురం ఎమ్మెల్యే, ఎంపీ అభ్వర్థులు దీపిక, శాంతమ్మలకు ఓట్లు గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి, రాయల సీమ కో ఆర్డినేటర్‌ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, జిల్లా అధ్యక్షులు నవీన్‌ నిశ్చల్‌, హిందూపురం ఎంపీ అభ్వర్థి శాంతమ్మ, ఎమ్మెల్యే అభ్శర్థి దీపిక, పెనుకొండ ఎమ్మెల్యే అభ్వర్థి ఉషశ్రీ చరణ్‌, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ఇంద్రజ, వైస్‌ ఛైర్మన్లు జబివుల్లా, బలరామిరెడ్డితో పాటు వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️