అనిశ్చితి.. అయోమయం

నేటి రాజకీయాలు ఆశావహులను తమకు ఖాయమనుకుంటున్న అభ్యర్థులను అయోమయం లోకి నెట్టివేస్తూ.. అనిశ్చత పరిస్థితిని

నేటి రాజకీయాలు ఆశావహులను తమకు ఖాయమనుకుంటున్న అభ్యర్థులను అయోమయం లోకి నెట్టివేస్తూ.. అనిశ్చత పరిస్థితిని సృష్టించాయి. జిల్లా పరిస్థితి అందుకు భిన్నంగా లేదు. ‘ఎల్లమ్మను ఎంచక్కర్లేదు… పోలయ్యను పొగడక్కల్లేదు’ అన్నది ప్రధాన రాజకీయ పార్టీల్లో నెలకుంది. ప్రధానంగా అధికార పార్టీలో అలజడి సృష్టిస్తుంది. ప్రధానంగా దశల వారీ నియోజకవర్గాల్లో జరుగుతున్న చేర్పులు, మార్పులు అందుకు కారణమైనా ఇప్పటికే రాష్ట్రంలో 34 మార్పులు జరిగాయి. ఈ జిల్లాలో ఒకటి రెండు స్థానాల్లో మార్పులుంటాయన్న ప్రచారం ఆ పార్టీలోనే ఉంది. ఐప్యాక్‌ సర్వేతో పాటు మరో సర్వే సంస్థ, ప్రభుత్వ ఇంటిలిజెన్స్‌ సమాచారం వెరసి క్రోడీకరించి తుది నిర్ణయానికి వచ్చి మార్పులు చేస్తున్నట్లు తెలిసింది. జిల్లాలో జరుగుతున్న మార్పుల్లో పార్లమెంట్‌ అభ్యర్థి ఎంపిక ముడిపడి ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాడేపల్లి వర్గాల సమాచారం ప్రకారం జిల్లాలో రెండు మూడు స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక అధినేతకు ఒక సవాల్‌గా మారిందని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఒకరికి పట్టం కట్టడంతో ఆ నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలకు, అసంతృప్తులకు చెల్లుచీటీ ఉంటుందని అధినేత భావించినా… నేటికీ యథాస్థితి కొనసాగుతుంది. జిల్లాలో సీనియర్‌ నేతలిద్దరు చెరొక అభ్యర్థిని అధినేత ముందు ప్రతిపాదించడం గ్రూపు రాజకీయాలకు అద్ధం పడుతుంది. అభ్యర్థుల ఎంపికలో సామాజిక అంశం క్రియాశీలకపాత్ర వహిస్తున్నట్లు కనిపిస్తుంది. భాషాపరమైన మైనారిటీల నినాదం ఇచ్ఛాపురానికి తాకింది. భాషాప్రాతిపదికన మైనారిటీగా ఉన్న ఒడిశా ప్రజలు టెక్కలి, పలాస డివిజన్లలో ఎక్కువగా ఉన్నామని, ఈసారి ఇచ్ఛాపురం స్థానం కట్టబెట్టాలని భాషాపరమైన మైనారిటీలు కోరుకునే పరిస్థితి వచ్చింది. వారికి పార్టీ ఏ రూపంలో సంతృప్తిపరుస్తుందో చూడాల్సి ఉంది. స్థానిక ప్రతిపాదిస్తున్న ఆ మహిళా నాయకులకు మున్సిపాలిటీ పరిధి తప్ప నియోజకవర్గంలో చెలాంటి పట్టు లేదని, అర్ధబలం చాలదని పార్టీ సీనియర్లు కొందరు చెబుతున్నారు. దీన్ని ఆమెను ప్రతిపాదిస్తున్న వారు కొట్టిపారేస్తున్నారు. అందుకు తాజాగా ఉమ్మడి జిల్లాలోని రాజాం అభ్యర్థి మార్పు విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులుకు అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేటకు పంపడాన్ని గుర్తుచేస్తున్నారు. అక్కడి ఎమ్మెల్యేను పార్లమెంట్‌కు పంపిస్తున్నట్లు తెలిసింది. గత ఎన్నికల్లో కొండ్రు మురళీమోహన్‌ వైసిపిలోకి వెళ్లాలని ప్రయత్నించినప్పుడు పాయకరావుపేటలో పోటీ చేయాలని జగన్‌ చెప్పడంతో నియోజకవర్గం వదలక రాజాంలోనే టిడిపి అభ్యర్థిగా బరిలో నిలిచిన చరిత్రను చూశాం. జెడ్‌పి చైర్‌పర్సన్‌ స్థానం ఇచ్ఛాపురం వెళ్లింది. ఇప్పుడు ఎంపీ టిక్కెట్‌ కూడా ఆ ఇచ్ఛాపురానికే కేటాయిస్తే మంచిదని సూచనను మరో జిల్లా నేత అధినేత ముందు ఉంచడం చర్చనీయంశమైంది. ఇదే సమయంలో రెడ్డిక సామాజిక వర్గం ఇటీవలనే పిక్నిక్‌ పేరుతో ప్రత్యేక సమావేశం కావడం నేతల ద్వారా లాబీయింగ్‌ చేస్తున్నారని తెలిసింది. అయితే జగన్‌ ముందు సర్వేలు ముఖ్య భూమిక పోషిస్తున్నట్లు తెలిసింది. పలాస అభ్యర్థి విషయంలో ఎలాంటి మార్పు ఉండకపోయినా అక్కడి అసంతృప్తి సెగలను చల్లార్చేందుకు బుజ్జగింపులు, బెదిరింపులు ఉంటాయా! లేక బరోసాలు ఉంటాయా! అన్నది మున్ముందు చూడాల్సి ఉంటుంది. పాతపట్నం నియోజకవర్గం అభ్యర్థి మార్పు ఉండదని ఆ కుటుంబంతో ఉన్న సంబంధాలను బట్టి భావించాలి. కానీ, అసమ్మతి పోరుతో పాటు దాన్ని చూసి స్థానికేతరులను రంగంలోకి దించేందుకు జిల్లాలో ముఖ్య నేత ఒకరు మళ్లీ పావులను కదుపుతున్నట్లు తెలిసింది. టెక్కలి నియోజకవర్గం అభ్యర్థి విషయంలో అధినేతకు సవాల్‌గా మారిందని తెలిసింది. ‘రెండు పిల్లులు, కోతి రొట్టె ముక్క చందం’గా నేతల వ్యవహరం ఉండడంతోనే పార్టీకి ఈ దయనీయ పరిస్థితి వచ్చినట్లు సీనియర్లు భావిస్తున్నట్లు తెలిసింది. టెక్కలి ఎవరూ ఊహించని విధంగా కొత్త అభ్యర్థి తెరపైకి రావచ్చు. లేకుంటే స్థానికంగా ఉన్న మరో ముఖ్య నేత పేరు కూడా ముందుకు రావచ్చునన్న చర్చ ప్రారంభమైంది. ఎచ్చెర్లలోనూ అసమ్మతి పోరు బలంగా ఉంది. ఆ నియోజకవర్గంలో ప్రత్నామ్యా అభ్యర్థి ఎవరూ లేరనే నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. ఏడుకొండల వారి నామ జపం ముందుకు వస్తున్నా… అది ప్రభావితం అవుతుందా! గోవిందాఅవుతుందా! అన్నది చూడాల్సి ఉంది. జిల్లాలో ప్రధానమైన ఆమదాలవలస, శ్రీకాకుళం, నరసన్నపేట నియోజకవర్గాల విష యంలో పార్టీమెంట్‌ అభ్యర్థి ఎంపికతోనే తేలాల్సి ఉంది. ఇది ప్రస్తుత పరిస్థితి. జిల్లాలో టిడి పరిస్థితి కొన్ని నియోజక వర్గాల్లో అలానే ఉంది. టెక్కలి, ఇచ్ఛాపురం, ఆమదాలవలస, పాతప ట్నం నియోజకవర్గాల్లో ఎలాంటి మార్పు ఉండదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శ్రీకాకు ళం, పలాసల్లో ఒక వేళ అభ్యర్థుల మార్పు ఉన్నా ఆ కుటుంబాలను దాటివెళ్లవని తెలిసింది. ఎన్నికల్లో పదే పదే చంద్రబాబు చెప్పిన మాట యువతకు ప్రాధాన్యత ఇస్తామన్నది నరసన్నపేటలో ఆ మార్పు జరిగితే ఆయన మాట చెల్లుబాటు జరిగినట్లేనని ఆ పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. డాక్టర్‌ బగ్గు శ్రీనివాసరావు టిక్కెట్‌ వస్తుందన్న ఆశలో ఎదురు చూస్తున్నారు. పాతపట్నంలో టిడిపికి అసమ్మతి రాగం గట్టిగా వినిపిస్తుంది. ఆ రాగాన్ని ఏ రూపంలోనైనా తగ్గించకుంటే తిరుగుబాటు అభ్యర్థిగాను, లకుంటే ప్రథ్యర్థికి సహకరించి వెన్నుపోటు పొడిచే ఉండొచ్చునన్న ప్రచారం బలంగా ఉంది. ఎచ్చెర్లలోనూ టిడిపి అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటుంది. అక్కడ నుంచి కళావెంకటరావుకు పార్లమెంట్‌కు పంపదల్చితే కొత్త అభ్యర్థి తెరపైకి వస్తే అవకాశం ఉంది. కళావెంకటరావు శాసనసభకు పోటీ చేస్తే పార్టీలో గ్రూపులు, ఆధిపత్య పోరులో ఇండిపెండెంట్‌గానూ, తిరుగుబాటు అభ్యర్థిగాను మరొకరు రంగంలోకి దిగే పరిస్థితి ఎక్కువగా ఉంది. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే వరకు టిడిపి అభ్యర్థులను ప్రకటించే పరిస్థితి ఉండదని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. జనసేన పొత్తుతో టిడిపి నేతలు సంబరపడుతున్నా… జిల్లాలో ఆ పార్టీ ప్రభావం ఇప్పటికీ కనిపించడం లేదు. బూత్‌స్థాయిలోనే కాదు జిల్లాస్థాయిలోనూ ఆ పార్టీకి పుష్కర కాలమైనా ఎలాంటి నాయకత్వం లేదు. ఆ పార్టీ ఆ ప్రయత్నం చేయలేదు. జిల్లా ఇప్పటికే మంచం ఎక్కిన కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ పునర్నిర్మాణం కదలిక మొదలైంది. సీనియర్లను సన్మానించడం, కొత్త కేడర్‌ను చేర్చుకుని కండువాలు కప్పడం, పార్టీలో చేర్చుకోవడం ప్రారంభించింది. ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించిన తరువాత మార్పులు, చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది. అంతవరకు అనిశ్చతే కొనసాగుతుంది. నేతల్లో అయోమయం ఉంటుంది. – సత్తారు భాస్కరరావు

➡️