ఆన్‌లైన్‌లోనూ నామినేషన్లు

రానున్న సార్వత్రిక ఎన్నికలకు

పాల్గొన్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌, జెసి నవీన్‌

  • ఎన్నికల అదనపు కమిషనర్‌ హరిందర్‌ ప్రసాద్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

రానున్న సార్వత్రిక ఎన్నికలకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనూ నామినేషన్లు సమర్పించేలా కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందించిందని రాష్ట్ర ఎన్నికల అదనపు కమిషనర్‌ ఎం.ఎన్‌ హరిందర్‌ ప్రసాద్‌ తెలిపారు. నిర్ణీత నమూనాలో రబఙఱసష్ట్రa.వషఱ.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ ద్వారా నామినేషన్లు దాఖలు చేసే అవకాశాన్ని ఈ ఏడాది కల్పించిందని వివరించారు. జిల్లాల నోడల్‌ అధికారులతో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో వెబ్‌సైట్‌ వినియోగంపై అవగాహన కల్పించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత నామినేషన్ల గడువు ముగిసే ముందు రోజు వరకూ నిర్దిష్ట విధానంలో సాధారణ నామినేషన్‌ తరహాలోనే ఎన్నికల కమిషన్‌ సూచించిన పత్రాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాల్సి ఉంటుందని వివరించారు. దరఖాస్తు ఫారంలో దశల వారీగా అభ్యర్థుల వివరాలు, వారి ఆస్తుల అఫిడవిట్‌ పత్రాలు, నిర్ధారిత నామినేషన్‌ డిపాజిట్‌, పది మంది బలపరచాల్సిన వారి వివరాలు సైతం ఇవ్వాలన్నారు. ప్రతి దశలో ముందుగా వచ్చిన వివరాలు నమోదు చేసిన తర్వాత ప్రక్రియ ముందుకు వెళ్తుందని తెలిపారు. అభ్యర్థి తన డిపాజిట్‌ కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించాలని చెప్పారు. అన్నింటిని సమర్పించిన తర్వాతనే నామినేషన్‌ దాఖలు చేసేందుకు ఉన్న నిర్ణీత సమయంలో స్లాట్‌ సమయాలను బుక్‌ చేసుకోవాలని సూచించారు. ఆ తర్వాత ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిని నేరుగా కలిసి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన వివరాలతో కూడిన పత్రాలను నామినేషన్‌ చివరి రోజులోగా తప్పనిసరిగా అందించాలన్నారు. రిటర్నింగ్‌ అధికారికి నేరుగా అందిస్తేనే నామినేషన్‌ దాఖలు చేసినట్లుగా భావిస్తామని స్పష్టం చేశారు. ఒక అభ్యర్థి ఆన్‌లైన్‌ ద్వారా ఎన్ని నామినేషన్లు అయినా వేయొచ్చని, అందులో ఒకటి మాత్రమే చెల్లుబాటు అవుతుందన్నారు. నామినేషన్లను అన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ దాఖలు చేయొచ్చని చెప్పారు. శిక్షణా కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌, ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ ఎం.అప్పారావు, నోడల్‌ అధికారులు సిపిఒ ప్రసన్నలక్ష్మి, డ్వామా పీడీ చిట్టిరాజు, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి చెన్నకేశవరావు, సెట్‌శ్రీ సిఇఒ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

➡️