ఉద్యోగ భద్రత కల్పించాలని కలెక్టరేట్‌ వద్ద విఒఎల ధర్నా

Mar 4,2024 22:06

ప్రజాశక్తి-శ్రీకాకుళం అర్బన్‌ : విఒఎలకు మెడపై కత్తిలా ఉన్న కాలపరిమితి సర్క్యులర్‌ రద్దుచేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని, హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని, తదితర డిమాండ్లపై కలెక్టరేట్‌ వద్ద ఎపి వెలుగు విఒఎల సంఘం ఆధ్వర్యాన సోమవారం ధర్నా చేపట్టారు. తొలుత ఆర్‌అండ్‌బి అతిథి గృహం నుంచి కలెక్టరేట్‌ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ గేటు ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.అమ్మన్నాయుడు, విఒఎల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.ప్రభావతి, జి.అసిరినాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విఒఎల పట్ల చిన్నచూపు చూస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామ సమాఖ్యల విలీనం ఆపాలని, సంఘాలను విడగొట్టడం, కలపడం లాంటి పనులు సెర్ఫ్‌ అధికారులే చేయడం సరైనది కాదని చెప్పారు. విఒఎల విలీనం వల్ల వేలాది మంది ఉపాధి కోల్పోతారని ఆందోళన వ్యక్తంచేశారు. విలీనం ఆపి, ఎక్కువ సంఘాలున్న విఒఎల నుంచి తక్కువ సంఘాలున్న విఒఎలకు సర్దుబాటు చేయాలని డిమాండ్‌చేశారు. రాజకీయ జోక్యం అరికట్టాలన్నారు. ఇప్పటి వరకు 15 సంఘాలలోపు ఉన్న విఒఎలకు వేతనాలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విఒఎగా ఉపాధి కోల్పోయిన వారందరికీ ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. వయసు పైబడిన, అనారోగ్యంతో ఉన్న వారి కుటుంబ సభ్యులకు విఒఎలుగా అవకాశం కల్పించాలని కోరారు. రూ.10 లక్షల గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌చేశారు. అన్ని రకాల బకాయిలు చెల్లించాలని, లోకో యాప్‌ కోసం 5జి మొబైల్‌ ప్రభుత్వమే ఇవ్వాలని కోరారు. మహిళా మార్టులో కొనుగోళ్లకు విఒఎలకు లక్ష్యం విధించడం సరికాదన్నారు. రికవరీ పేరుతో వేతనాల కోత విధించడం ఆపాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయుకులు ఆర్‌.ప్రకాశ్‌, విఒఎల సంఘం నాయకులు డి.జోగారావు, ఎం.విమల, సరిత, రోహిణి, జి.ఎర్రయ్య, ఎస్‌.లక్ష్మి, వై.ద్రౌపది, ఉమ, బి.హేమ తదితరులు పాల్గొన్నారు.

➡️