ఉలిక్కిపడిన ఉద్దానం

ఉద్దానం ప్రాంతంలో

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు కుమారస్వామినారాయణమ్మ

*  ఎలుగు దాడిలో నలుగురికి గాయాలు

  • ఇద్దరి పరిస్థితి విషమం

ప్రజాశక్తి – వజ్రపుకొత్తూరు

ఉద్దానం ప్రాంతంలో ఎలుగుబంటుల దాడి ఉలిక్కిపడేలా చేసింది. మండలంలోని చీపురపల్లి పంచాయతీ పరిధిలోని ఎం.గడూరు, డెప్పూరులో ఎలుగుబంటులు దాడి ఘటనలో గురువారం నలుగులురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల కథనం ప్రకారం ఎం.గడూరుకు చెందిన పిన్నాసి కుమారస్వామి ఉదయం ఎనిమిది గంటల సమయంలో సముద్ర తీరం నుంచి వస్తుండగా మార్గమధ్యంలో తల్లి, పిల్ల ఎలుగుబంటులు కనిపించాయి. దీంతో ఆందోళన చెందిన ఆయన చెట్టు ఎక్కాడు. కుమారస్వామిని గమనించని తల్లి ఎలుగుబంటి ముందుకు వెళ్లిపోగా, పిల్ల ఎలుగుబంటి చెట్టు ఎక్కుతున్న కుమారస్వామిని కిందికి లాగేసింది. దీంతో తల్లి బంటి వచ్చి కుమారస్వామి తలపై కుడి భాగంలో, పొట్ట, కుడి కాలుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దీంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. డెప్పూరుకు చెందిన లైశెట్టి నారాయణమ్మ తోటలోని రేగుపళ్లు ఏరేందుకు వెళ్లగా ఆమె ముఖంపై ఎలుగుబంటి దాడి చేసి కన్ను భాగంలో తీవ్రంగా గాయపరిచింది. అదే గ్రామానికి చెందిన పొకల ఊర్మిళ, శీలం తాతారావు కంచె పనులు చేస్తుండగా వారిపై ఎలుగుబంట్లు దాడికి ప్రయత్నించే సమయంలో అక్కడే ఉన్న పిన్నాసి చలపతిరావు, పెంపుడు కుక్కలు ఎలుగుబంటులను ఎదురించాయి. ఊర్మిళ, తాతారావు చేతికి గ్లౌజులు ఉండడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ నలుగురిపై రెండు ఎలుగులు దాడి చేశాయా?, మూడు ఎలుగులు దాడి చేశాయో కచ్చితంగా తెలియడం లేదు. గాయపడిన కుమారస్వామి, నారాయణమ్మను స్థానికులు ఆటోలో పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం నిమిత్తం శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి 108లో తరలించారు. 2022 మేలో మండలంలోని కిడిసింగిలో రైతుపై ఎలుగుబంట్లు దాడి చేసి పొట్టన పెట్టుకున్నాయి. అదే నెలలో వజ్రపుకొత్తూరులో ఆరుగురిపై దాడి చేయగా చికిత్స పొందుతూ ఒకరు, చికిత్స అనంతరం ఒకరు మృతి చెందారు. మళ్లీ ఇప్పుడు నలుగురిపై దాడి చేయడంతో ఉద్దానం ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాశీబుగ్గ అటవీశాఖ అధికారి మురళీకృష్ణం నాయుడు మాట్లాడుతూ ఎలుగులు ఎదురైనపుడు కవ్వింపుచర్యలకు పాల్పడవద్దన్నారు. ఆత్మరక్షణ కోసం ఆయుధాలు ధరించాలని సూచించారు. ఎస్‌ఐ మధుసూదనరావు, అటవీశాఖ అధికారులు ఆస్పత్రిలో క్షతగాత్రులను పరిశీలించి వివరాలను తెలుసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

 

 

➡️