ఒక్క ఓటూ చీలకూడదు

ఒక్క ఓటూ చీలకుండా జనసేన, టిడిపి నాయకులు కలిసి పనిచేయాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌

చెక్కును అందజేస్తున్న మనోహర్‌

  • వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యం
  • జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ మనోహర్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ఒక్క ఓటూ చీలకుండా జనసేన, టిడిపి నాయకులు కలిసి పనిచేయాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. నగరంలోని ఒక ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం నిర్వహించిన జనసేన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసిపి విముక్త అంధ్రప్రదేశ్‌ కోసం జనసైన్యం కంకణం కట్టుకుందన్నారు. వచ్చే ఎన్నికల్లో గ్రామ గ్రామాన కష్టపడి టిడిపి, జనసేన నాయకులను గెలిపించుకోవాలని సూచించారు. వైసిపి ప్రభుత్వం అథికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిదిసార్లు పంటలు నష్టపోయాయని, రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క ఉద్యోగం కానీ, ఒక్క పరిశ్రమ గానీ రాలేదన్నారు. సరదాగా బటన్‌ నొక్కడం తప్ప ఈ ప్రభుత్వంతో ఒరిగిందేం లేదని విమర్శించారు. నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజలను ఎంతగా హింసించారో గమనించాలన్నారు. పాల వెల్లువ పేరుతో మూడు లక్షలకు పైగా బర్రెలు కొన్నామని చెప్తున్న ప్రభుత్వం, వాటిని ఎక్కడ ఉంచిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. గ్రామ సచివాలయాలు రాజ్యాంగ విరుద్ధమని కాగ్‌ నివేదిక ఇచ్చిందన్నారు. సర్పంచ్‌లకు గ్రామ సచివాలయాలను అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా పట్టించుకోకుండా పెడచెవిన పెడుతున్నారన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అద్భుతమైన వనరులు, ఇతర సౌకర్యాలు ఉన్నా పారిశ్రామికంగా ఎందుకు అభివృద్ధి చేయడం లేదని ప్రశ్నించారు. మత్స్యకారులు గుజరాత్‌కు వలస పోవాల్సిన దుస్థితి కల్పించారన్నారు. అలాంటప్పుడు ఇక్కడి నేతలకు పదవులు ఎందుకని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక మేనిఫెస్టో తీసుకొస్తామని పవన్‌ కళ్యాణ్‌ చెప్పారని గుర్తుచేశారు. రాజకీయాల్లో పల్లకి మోసే బోయిలుగా కార్యకర్తలను విస్మరించే సంస్కృతి జనసేన పార్టీలో ఉండదని స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటామన్నారు. అనంతరం ఇటీవల మృతి చెందిన నలుగురు జన సైనికుల కుటుంబాలకు పార్టీ తరపున ఆర్థికసాయం అందజేశారు. వారి కుటుంబసభ్యులను ఓదార్చి చెక్కులను అందజేశారు. సమావేశంలో జనసేన నాయకులు కోరాడ సర్వేశ్వరరావు, విశ్వక్‌సేన్‌, గేదెల చైతన్య, హనుమంతు కిరణ్‌కుమార్‌, ఎన్ని రాజు, పేడాడ రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

 

➡️