ఓటర్ల జాబితాలో అక్రమాలు

ఒడిశా రాష్ట్రానికి చెందిన వందలాది ఓట్లు పాతపట్నం నియోజకవర్గ ఓటర్ల జాబితాలో చేర్చి విడుదల

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ

కొత్తూరులో ఒడిశా వాసుల ఓట్లు

ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం

ఓట్ల అక్రమ నమోదుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం

మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ఒడిశా రాష్ట్రానికి చెందిన వందలాది ఓట్లు పాతపట్నం నియోజకవర్గ ఓటర్ల జాబితాలో చేర్చి విడుదల చేశారని మాజీ ఎమ్మెల్యే, పాతపట్నం నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి కలమట వెంకటరమణ అరోపించారు. నగరంలోని టిడిపి జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాతపట్నం నియోజకవర్గం పరిధిలోని కొత్తూరు మండలం బూత్‌ నంబరు 202లో ఓటర్ల జాబితాలో 81 ఓట్లు స్థానికులవి కావని, ఒడిశాకు చెందిన వారి పేర్లు నమోదు చేశారని చెప్పారు. గతంలో జిల్లాకు స్పెషల్‌ ఎలక్ట్రోరల్‌ స్పెషల్‌ ఆఫీసర్‌గా వచ్చిన శ్యామలరావుకు ఫిర్యాదు చేశానని, ఆయన గత కలెక్టర్‌తో సహా కిందిస్థాయి అధికారులందరికీ దీనిపై విచారణ చేయించాలని ఆదేశించినా వాటిని తొలగించలేదన్నారు. అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా ఒడిశా ఓటర్లను బంధుత్వం పేరుతో హిరమండలం ఓటర్ల జాబితాలో చేరుస్తున్నారని తెలిపారు. ఒడిశాకు చెందిన నాగమణి, విశ్వనాథం దంపతులకు పాతపట్నం ఓటరు జాబితాలో చేర్చారని చెప్పారు. ఓట్ల అక్రమ నమోదులో ఎన్నికల సంఘం కూడా విఫలం కావడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్టు తెలిపారు. హిరమండలం జెడ్‌పిటిసి పొగిరి బుచ్చిబాబు మాట్లాడుతూ హిరమండలం మేజర్‌ పంచాయతీలోని బూత్‌ నంబరు 303లో 262 ఓట్లు అక్రమంగా నమోదు చేశారని తెలిపారు. తమ గ్రామానికి సంబంధం లేని వారిని, మరణించిన వారిని సైతం ఈ జాబితాలో చేర్చడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు. ఎల్‌ఎన్‌పేట మండలానికి చెందిన కొందరి పేర్లను హిరమండలంలో చేర్చారన్నారు. రెండు చోట్ల ఓట్లు ఉండడంపై ఇఆర్‌ఒ, ఎఇఆర్‌లకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో టిడిపి నాయకులు తేజేశ్వరరావు, వి.సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

 

➡️