కొండపల్లిలో ఎలుగు సంచారం

మండలంలోని చీపురుపల్లి

సంచరిస్తున్న ఎలుగు

ప్రజాశక్తి- వజ్రపుకొత్తూరు

మండలంలోని చీపురుపల్లి పంచాయతీ కొండపల్లిలో బుధవారం ఎలుగుబంటి సంచరించడంతో ప్రజలు హడలిపోయారు. ఉదయం పది గంటల సమయంలో కొండపై నుంచి దిగిన ఎలుగు ప్రాథమిక పాఠశాల పక్క నుంచి వెళ్లింది. పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలు ఒకేచోట ఉండగా, అందులో 30 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. ఎలుగు సంచరించే సమయంలో పిల్లలు ఎవరూ బయట లేకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. నాలుగు రోజుల కిందట అక్కుపల్లికి చెందిన మోస చిన్న ధనరాజు, మడ్డు జోగారావు వేకువజామున వాకింగ్‌కు కాశీబుగ్గ వైపు గల మంకినమ్మ ఆలయం వైపు వెళ్తుండగా, తోట నుంచి వచ్చిన రెండు ఎలుగులు వారిపై దాడికి ప్రయత్నించాయని స్థానికులు చెప్పారు. వారు తేరుకుని వాటికి అందకుండా పరుగెత్తడంతో బయటపడ్డారని తెలిపారు. ఇటీవల ఎం.గదూరు, డెప్పూరులో ఎలుగు దాడిలో గాయపడిన కుమారస్వామి, నారాయణమ్మ విశాఖపట్నంలోని కెజిహెచ్‌లో చికిత్స పొందుతున్న విషయం విదితమే.

 

 

➡️