గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం

75వ గణతంత్ర దినోత్సవ

ఏర్పాట్లను పరిశీలిస్తున్న జెసి, ఇతర అధికారులు

  • ప్రదర్శనకు సిద్ధమైన 20 శకటాలు
  • 16 ప్రభుత్వ శాఖలకు చెందిన స్టాల్స్‌ ఏర్పాటు
  • సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్న విద్యార్థులు
  • 254 మందికి ప్రశాంసా పత్రాలు
  • ఏర్పాట్లను పరిశీలించిన జెసి నవీన్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు నగరంలోని ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల మైదానం ముస్తాబు అయింది. పతాకావిష్కరణతో పాటు సైనిక వందన స్వీకరణకు వేదికను సిద్ధం చేశారు. జిల్లా అభివృద్ధిని ప్రతిబింబించేలా 20 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన శకటాలను ప్రదర్శనకు సిద్ధం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియజేయడంతో పాటు లబ్ధిదారులకు ఉపకరణాలు అందించేందుకు బ్యాంకర్లు, పలు సంక్షేమ రంగాలకు చెందిన ప్రభుత్వ శాఖల ఆధ్వర్యాన 16 స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చేందుకు పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులను ఎంపిక చేశారు.మువ్వన్నెల పతాకాన్ని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ ఎగురవేయనున్నారు. పతాకావిష్కరణ అనంతరం ఎస్‌పి జి.ఆర్‌ రాధికతో కలిసి సైనిక వందనాన్ని స్వీకరిస్తారు. అందుకోసం ప్రత్యేక శకటాన్ని సిద్ధం చేశారు. పోలీసుల సైనిక వందనం, విన్యాసాల ప్రదర్శన అనంతరం విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ప్రధాన వేదిక ముందు ఈ కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలుస్తున్నారు. అధికారులు, వీక్షకులు కూర్చునేందుకు ప్రత్యేక వసతి ఏర్పాటు చేశారు. అనంతరం జిల్లా అభివృద్ధిని తెలియజేసేందుకు ఐటిడిఎ, డిఆర్‌డిఎ, అటవీశాఖ, పౌరసరఫరాల శాఖ, నీటిపారుదల శాఖ, డ్వామా, వైద్యారోగ్య, విద్యాశాఖలతో పాటు మొత్తం 20 శకటాలను ప్రదర్శనకు సిద్ధం చేశారు. వాటిలో ఉత్తమ శకటాలకు బహుమతులు అందజేస్తారు. జిల్లావ్యాప్తంగా 72 ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 246 మంది ఉద్యోగులను ప్రశంసిస్తూ వారి సేవలకు గుర్తింపుగా ప్రశంసాపత్రాలను అందజేస్తారు. జిల్లా ప్రగతిని, చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రసంగించనున్నారు.ఏర్పాట్లు పరిశీలనగణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ పలు శాఖల అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్‌ సరఫరా తదితర అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, స్వాతంత్య్ర సమరయోధులకు, ప్రజలకు సీటింగ్‌ ఏర్పాట్లు ప్రోటోకాల్‌ ప్రకారం చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. మైదానం అంతా పరిశుభ్రంగా సిద్ధం చేయాలన్నారు. ప్రజలందరూ వేడుకలను వీక్షించే విధంగా అవసరమైన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సహాయ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, ఆర్‌డిఒ సిహెచ్‌.రంగయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ చల్లా ఓబులేసు, డిఆర్‌డిఎ, డ్వామా పీడీలు విద్యాసాగర్‌, చిట్టిరాజు తదితరులు పాల్గొన్నారు.పోలీస్‌ కవాతు రిహార్సల్స్‌ పరిశీలనగణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న పోలీస్‌ కవాతు రిహార్సల్స్‌ను ఎస్‌పి జి.ఆర్‌ రాధిక ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో గురువారం పరిశీలించారు. పరేడ్‌ కమాండర్‌ గౌరవ వందనం సమర్పించారు. రిహార్సల్స్‌లో పోలీస్‌ అధికారులు, సిబ్బంది, పోలీస్‌ బ్యాండు ప్రదర్శన బాగుందని చెప్తూ కొన్ని మార్పులు సూచించారు. కవాతు మరింత అద్భుతంగా నిర్వహించాలన్నారు. గణతంత్ర వేడుకలలకు ముఖ్య అతిథులు, ప్రజలు, విద్యార్థులు హాజరవుతున్న నేపథ్యంలో భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని, వాహనాల పార్కింగ్‌, ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎఎస్‌పిలు టి.పి విఠలేశ్వర్‌, జె.తిప్పేస్వామి, డిఎస్‌పిలు వై.శృతి, కె.ఎస్‌ వాసన్‌, సిఐ పి.శ్రీనివాసరావు, ఆర్‌ఐలు సురేష్‌, ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.254 మందికి ప్రశంసాపత్రాలురిపబ్లిక్‌ డే వేడుకలను పురస్కరించుకుని అత్యుత్తమ సేవలందించిన ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలకు చెందిన 254 మందికి ప్రశంసాపత్రాలను అందజేయనున్నారు. వీరిలో 85 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 246 మందిని ఎంపిక చేయగా, ఏడు స్వచ్ఛంద సంస్థల నుంచి ఎనిమిది మందిని ఎంపిక చేశారు.

 

 

➡️