గరిమెళ్ల పోస్టల్‌ స్టాంప్‌ విడుదల

స్వాతంత్య్ర సమరయోధుడు, కవి, రచయిత గరిమెళ్ల సత్యనారాయణ పోస్టల్‌ స్టాంప్‌ను

పోస్టల్‌ స్టాంపును ఆవిష్కరిస్తున్న కృష్ణదాస్‌ తదితరులు

ప్రజాశక్తి – పోలాకి

స్వాతంత్య్ర సమరయోధుడు, కవి, రచయిత గరిమెళ్ల సత్యనారాయణ పోస్టల్‌ స్టాంప్‌ను ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌, విశాఖపట్నం రీజియన్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ కల్నల్‌ వి.రాములు ఆవిష్కరించారు. గరిమెళ్ల వర్థంతి సందర్భంగా పోస్టల్‌ శాఖ సౌజన్యంతో గరిమెళ్ల మెమోరియల్‌ ట్రస్టు, గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యాన మండలంలోని ప్రియాగ్రహారంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భావితరాలు గరిమెళ్ల సత్యనారాయణ త్యాగాన్ని గుర్తుంచుకునేలా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా పోస్టల్‌ స్టాంపును విడుదల చేసినట్లు తెలిపారు. మాకొద్దీ తెల్లదొరతనం అంటూ బ్రిటిష్‌ వారి గుండెల్లో పాటల తూటా పేల్చిన జాతీయ కవి గరిమెళ్ల సత్యనారాయణ అని కొనియాడారు. జాతి మరిచిపోతున్న జాతి రత్నం గరిమెళ్ల అని అన్నారు. పోస్టల్‌ పర్యవేక్షణాధికారి పి.శ్రావణ్‌ కుమార్‌ మాట్లాడుతూ దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో గరిమెళ్ల ప్రథముడు అని తెలిపారు. గరిమెళ్ల మెమోరియల్‌ ట్రస్టు ప్రధాన కార్యదర్శి బాడాన రాజు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాకు గరిమెళ్ల పేరు పెట్టాలని డిమాండ్‌ చేశారు. గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం అధ్యక్షులు వి.జి.కె మూర్తి మాట్లాడుతూ గరిమెళ్ల జయంతి, వర్థంతులను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. అంతకుముందు ఐ.గణపతిరావు ఆధ్వర్యాన విద్యార్థులు ప్రదర్శించిన మాకొద్దీ తెల్లదొరతనం నృత్యరూపకం అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్‌ కె.రాజేశ్వరరావు, ఎంపిపి ముద్దాడ దమయంతి, భైరాగినాయుడు, రెంటికోట త్రినాథరావు, గరిమెళ్ల మెమోరియల్‌ ట్రస్టు, గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం సభ్యులు కె.శ్రీనివాసరావు, డి.కోటేశ్వరరావు, ఎన్‌.మాధవరావు, శ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయులు విశ్వేశ్వరరావు, ప్రిన్సిపాల్‌ నాగేంద్రశర్మ, సాహితీ అభిమానులు పాల్గొన్నారు.

 

 

➡️