గ్రామీణ బంద్‌ను విజయవంతం చేయాలి

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ, కార్మిక వ్యతిరేఖ విధానాలకు వ్యతిరేకంగా 16న దేశ వ్యాప్తంగా

పలాస : సమావేశంలో మాట్లాడుతున్న మోహనరావు

ప్రజాశక్తి- పలాస

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ, కార్మిక వ్యతిరేఖ విధానాలకు వ్యతిరేకంగా 16న దేశ వ్యాప్తంగా పారిశ్రామిక సమ్మె, గ్రామీణ బంద్‌కు సంయుక్త కిసాన్‌ మొర్చా, కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చాయి. మందస సిఐటియు కార్యాలయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌.గణపతి మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వ విధానాలతో ప్రజలు, రైతులు, కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్వామినాథన్‌ కమిషన్‌ నివేదిక ప్రకారం రైతాంగం పండించిన అన్నిరకాల పంటలకు మద్దతు ధరలు కల్పించాలని, కార్మిక వ్యతిరేఖ లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ సవరణ బిల్లు 2020ను రద్దు చేయాలని, వ్యవసాయానికి సాగునీరు అందించాలని, పెరుగుతున్న ధరలు అదుపు చేయాలని కోరారు. ఆహార భద్రతా చట్టం పటిష్టంగా అమలు చేయాలని, వంశధార కాలువ బహుదా నదికి అనుసంధానం చేసి రైతులకు సాగునీరు అందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. జీడి పిక్కల 80 కేజీల బస్తాకు రూ.16వేలు మద్దతు ధర నిర్ణయించి ఆర్‌బికెలు ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. అటవీహక్కుల చట్టం సవరణలు ఉపసంహరించాలని, ఆదివాసుల హక్కులను కాపాడాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సిఐటియు నాయకులు ఆర్‌.దిలీప్‌ కుమార్‌, పి.దేవేంద్ర, కె.కేశవరావు, రైతు సంఘం నాయకులు ఎం.ధర్మారావు, హమాలీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఎస్‌.వల్లభరావు, అప్పలస్వామి, రైస్‌ మిల్లు వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు, బి. దుర్యోధన సిహెచ్‌ అప్పన్న, అప్పలస్వామి, ఆర్‌ ఏకాసి పాల్గొన్నారు.కొబ్బరి బోర్డు ఏర్పాటు చేయాలిఉద్దానంలో విస్తారంగా సాగు చేస్తున్న జీడి, కొబ్బరికి బోర్డు ఏర్పాటు చేయాలని అఖిల భారత కిసాన్‌ మహాసభ జిల్లా కన్వీనర్‌ మద్దిల రామారావు డిమాండ్‌ చేశారు. పలాస కాశీబుగ్గ పట్టణంలో జగనన్న కాలనీలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ నెల 16న సమ్మె విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిఎం జగన్మోహన్‌రెెడ్డి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి, జిల్లా కమిటీ సభ్యులు పిన్నింటి నాగేశ్వరరావు, పోతనపల్లి బాలరాజు, పి.సింహాచలం, ఎల్‌. వెంకటమోహన్‌, దుర్గా ప్రసాద్‌, ఉపేంద్ర, సోమేష్‌, ఎం.దాసు, రవి, మార్పు కృష్ణారావు, భాస్కరరావు, లోకనాధం పాల్గొన్నారు.వజ్రపుకొత్తూరు: ఈ నెల 16న జరిగే సమ్మె జయప్రదం చేయాలని కౌలు రైతుల సంఘం నాయకులు బి.ఆనందరావు, సిఐటియు నాయకులు ఎన్‌.మోహనరావు కోరారు. శనివారం కిడిసింగిలో ఉపాధిహామీ వేతనదారులతో మాట్లాడారు. కార్యక్రమంలో ఎన్‌.చంద్రయ్య, బి.రామకృష,్ణ ఎన్‌.బైరాగి, ఉపాధి కార్మికులు పాల్గొన్నారు.పర్లాకిమిడి: 16న నిర్వహించనున్న బంద్‌ను విజయవంతం చేయాలని ఆల్‌ ఇండియా కిసాన్‌ సంఫ్‌ు జిల్లా అధ్యక్షులు ముచ్చి బంగారయ్య అన్నారు. పర్లాకిమిడి సిపిఎం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కార్యక్రమంలో ఆల్‌ ఇండియా కిసాన్‌ మజ్దూర్‌ సభ జిల్లా కార్యదర్శి కేదార్‌ సబర్‌, గజపతి జిల్లా రైతు కూలీ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి రొక్కం లోకనాధం, భారత్‌ కిసాన్‌ మజ్‌ దూర్‌ సంఫ్‌ు జిల్లా కార్యదర్శి జగన్నాధం, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

 

➡️