చంద్రబాబును జనం నమ్మరు

ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రజలకు

మాట్లాడుతున్న మంత్రి అప్పలరాజు

  • రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు

ప్రజాశక్తి – పలాస

ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తుంటే రాష్ట్రం మరో శ్రీలంకలా మారుతుందని విష ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు అవే పథకాలను తానూ ఇస్తానని చెప్తున్నారని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. చంద్రబాబు ఎన్ని హామీలు ఇచ్చినా, ఎన్ని మాటలు చెప్పినా రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. మండలంలోని మాకన్నపల్లిలో సచివాలయం, హెల్త్‌ క్లినిక్‌, నీలావతి గ్రామంలో రైతుభరోసా కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన అభివృద్ధి కన్నా ఈ ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఎక్కువ అభివృద్ధి చేశారని చెప్పారు. ఒకవైపు సంక్షేమ పథకాలు అందిస్తూ మరోవైపు అభివృద్ధి చేసిన ఘనత జగన్‌కే దక్కిందన్నారు. సంపద సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చంద్రబాబు చెప్తున్నారని… ఆయన సృష్టించిన సంపద, చేసిన అభివృద్ధిని చూసే ప్రజలు పక్కన కూర్చోబెట్టారని విమర్శించారు. ఉద్దానం ప్రాంతంలో ఎక్కువగా కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ మృత్యువాత పడుతున్నారని గుర్తించి 200 పడకల ఆస్పత్రితో పాటు కిడ్నీ పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించి ఉద్దాన ప్రజలకు అంకితం చేశామన్నారు. రూ.700 కోట్లతో శుద్ధజలం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్రంలో 40వేల పాఠశాలలను నాడు-నేడు పథకం ద్వారా అభివృద్ధి చేశామని చెప్పారు. జీడి రైతులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో జీడి రైతులతో ఈనెల 24వ తేదీన సిఎంఒ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 60 ఏళ్లుగా ఈ ప్రాంతాన్ని పరిపాలించిన గౌతు కుటుంబం చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని సవాల్‌ విసిరారు. అనంతరం టిడిపి నుంచి వైసిపిలోకి పలువురు చేరారు. వారికి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపిపి ఉంగ ప్రవీణ, పిఎసిఎస్‌ అధ్యక్షులు పైల వెంకటరావు, తహశీల్దార్‌ మధుసూదనరావు, ఎంపిడిఒ రమేష్‌ నాయుడు, వైసిపి నాయకులు ఉంగ సాయికృష్ణ, సర్పంచ్‌లు సైని దేశయ్య, సొర పద్మావతి, తామాడ మదన్‌, కోరాడ ధనరాజ్‌, ఎం.ఎన్‌ మూర్తి, తెప్పల అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు.

 

➡️