చంద్రబాబు స్క్రిప్టుతో షర్మిల విమర్శలు

టిడిపి అధినేత

మాట్లాడుతున్న జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ

  • జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్టుతో పిసిసి అధ్యక్షులు షర్మిల సొంత అన్నపై విమర్శలు చేస్తోందని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. నగరంలోని వైసిపి జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో రాణించాలంటే జగన్మోహన్‌ రెడ్డిని విమర్శించడం వల్ల ప్రయోజనం ఉండదన్నారు. జగన్‌పై చేసే విమర్శలను ప్రజలు విశ్వసించరని చెప్పారు. చంద్రబాబు పాలనలో తన సొంత వాళ్ల ప్రయోజనం కోసం ఏం చేశారు, ప్రజలకు ఏం చేశారు… జగన్‌ పాలనలో ప్రజలకు సంక్షేమ పథకాలతో ఆర్థిక పరిపుష్టి ఎలా కల్పించారో బేరీజు వేసుకోవాలని సూచించారు. ఎవరి పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయో గుర్తించాలన్నారు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజీ కావాలని సంతకం చేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి అంశాల వారీ మద్దతు ఇస్తున్నామని చెప్పారు. ఫెడరల్‌ వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సఖ్యతతో వెళ్లాల్సి ఉంటుందన్నారు. ప్రతిపక్షాలకు అధికారం కావాలని, వైసిపి ప్రభుత్వానికి ప్రజల సంక్షేమం కావాలన్నారు. ప్రజలు ఏదీ మరిచిపోరని, మరో 70 రోజుల్లో వారే అన్నింటికీ సమాధానం చెప్తారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, జగన్‌ ప్రభుత్వాల్లో ఎవరి పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయో ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు.టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు అంటూ స్వయంగా రాజీనామా లేఖ ఇచ్చారని, దాన్ని ఇప్పుడు స్పీకర్‌ ఆమోదించారని తెలిపారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో లేఖ రాసిన ఆయన నేరుగా ఆమదాలవలసలో స్పీకర్‌ సీతారాంను కలిసి రాజీనామా విషయం చెప్పారన్నారు. రాజీనామా ఆమోదంలో రాజకీయాలకు తావులేదన్నారు. లోకేష్‌ ఖాళీగా ఉండి ట్వీట్లు పెడుతున్నాడని, 70 రోజుల్లో ఎవరు మేకప్‌, ఎవరు ప్యాకప్‌ అన్నది తెలుస్తుందన్నారు. పాదయాత్ర చేసి శ్రీకాకుళం రాకుండానే ఎందుకు ప్యాకప్‌ అయిపోయాడో లోకేష్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్ర నుంచి అత్యదిక స్థానాలు గెలిచామని, ఇక్కడ్నుంచే తిరిగి ఎన్నికల పోరుకు సిద్ధమవుతున్నామని తెలిపారు. అందులో భాగంగానే ఈనెల 27న భీమిలిలో సిఎం సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో వైసిపి నాయకులు మామిడి శ్రీకాంత్‌, తమ్మినేని చిరంజీవి నాగ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️