తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

పాతపట్నం నియోజకవర్గ ప్రజల తాగునీటి సమస్యకు

మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు

  • ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు
  • రూ.265 కోట్లతో తాగునీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన

ప్రజాశక్తి – పాతపట్నం

పాతపట్నం నియోజకవర్గ ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. రూ.265 కోట్ల మంచినీటి పథకానికి సోమవారం శంకుస్థాపన చేశారు. కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌తో కలిసి ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించి, ప్రాజెక్టు మ్యాప్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాగువాడలో రూ.265 కోట్లతో ఈ బృహత్తర తాగునీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం తనకు దక్కిన గొప్ప గౌరవమన్నారు. హిరమండలం రిజర్వాయర్‌ నుంచి ఉద్దానం ప్రాంతానికి వంశధార జలాలను పంపించి ముఖ్యమంత్రి జగన్‌ ఈ ప్రాంత ప్రజలకు అపర భగీరథుడు అయ్యారన్నారు. 448 గ్రామాలకు లబ్ధి చేకూరే ఈ పథకం గురించి గడిచిన ప్రభుత్వాలు కనీస ఆలోచన చేయలేదని విమర్శించారు. వచ్చే ఏడాదిలో గానే గొట్టాబ్యారేజీ ద్వారా లిఫ్టులు ఏర్పాటు పూర్తి చేసి, వంశధార రిజర్వాయర్‌ను పూర్తిస్థాయిలో నింపి, మన వాటా జలాల 19 టిఎంసిల నీటిని సద్వినియోగం చేసుకొని శ్రీకాకుళం జిల్లాను అపర అన్నపూర్ణ జిల్లాగా మారుస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, ధర్మాన కృష్ణదాస్‌, కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ పేరాడ తిలక్‌, పంచాయతీరాజ్‌ ఎస్‌ఇ టి.శ్రీనివాస్‌ ప్రసాద్‌, డిఆర్‌డిఎ పీడీ విద్యాసాగర్‌, ఇఇ జి.జె బెనహర్‌, జెడ్‌పి డిప్యూటీ సిఇఒ అర్‌.వెంకట్రామన్‌, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

➡️