దగా డిఎస్‌సి కాదు… మెగా డిఎస్‌సి కావాలి

దగా డిఎస్‌సి కాదు... మెగా డిఎస్‌సి కావాలి

ధర్నా చేస్తున్న ఎఐవైఎఫ్‌ నాయకులు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

అరకొర ఉపాధ్యాయ పోస్టులతో దగా డిఎస్‌సిని రద్దు చేసి, మెగా డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని ఎఐవైఎఫ్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి మొజ్జాడ యుగంధర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 25 వేల ఉపాధ్యాయ పోస్టులకు మెగా డిఎస్‌సి నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎఐవైఎఫ్‌ ఆధ్వర్యాన కలెక్టరేట్‌ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ధర్నాకు జనసేన నాయకులు పి.కోటేశ్వరరావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు రాష్ట్రంలో 25 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని మెగా డిఎస్‌సి ద్వారా భర్తీ చేస్తామని చెప్పి 6,100 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వడం నిరుద్యోగులను మోసం చేయడమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్లుగా అదిగో డిఎస్‌సి, ఇదిగో డిఎస్‌సి అంటూ నిరుద్యోగులను మోసం చేసి నేడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ అతి తక్కువ పోస్టులతో నోటిఫికేషన్‌ ఇవ్వడం అన్యాయమని అన్నారు. రాష్ట్రంలో1.88లక్షల ఉపాధ్యాయులు ఉండాల్సిన చోట కేవలం 1. 69లక్షలు మాత్రమే ఉన్నారని, దాదాపు 18,520 ఖాళీ పోస్టులు ఉన్నాయని, ఇవి కాకుండా ఈనెలాఖరుకు మరో 5వేల మంది ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ చేయనున్నారని తెలిపారు. కేంద్రం చెప్తున్న లెక్కల ప్రకారం 40 వేల ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 117 జిఒ పేరుతో మరో పది వేల ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేసిందని గుర్తుచేశారు. వైసిపి ప్రభుత్వంలో రెండు వేల పాఠశాలలు మూసివేసిందని, ఇప్పటికే రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు తొమ్మిది వేలు ఉన్నాయని, అయితే ప్రభుత్వం ఖాళీలు లేవని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో అప్రెంటిస్‌ విధానాన్ని తీసుకొచ్చి నిరుద్యోగులను నిలువునా మోసం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మొత్తం ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎఐవైఎఫ్‌ నాయకులు ఎ.రాము, అరవింద్‌, కర్ణ వీరుడు, తులసీరావు, జనసేన నాయకులు వెలమల రాము, సాయి దిలీప్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️