ధాన్యం డబ్బులు ఎప్పుడు చెల్లిస్తారు?

ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని

ఆర్‌డిఒకు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

ప్రజాశక్తి- పలాస

ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి నెలలు గడుస్తున్నా నేటికీ ధాన్యం డబ్బులు రైతుల ఖాతాలో జమ కావడం లేదని, ధాన్యం డబ్బులు ఎప్పుడు చెల్లిస్తారని పలాస నియోజకవర్గ రైతాంగ సమస్యల సాధన కమిటీ అధ్యక్షులు మామిడి గోవిందరావు ప్రశ్నించారు. ఈ మేరకు ఆర్‌డిఒ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీడీ పంటపై కురుస్తున్న మంచు వల్ల పూత పూర్తిగా నాశినమైందని, పంటలకు బీమా స్కీమ్‌ అమలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. తిత్లీ తుపానుతో నష్టపోయిన ఏడు వేల మంది రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ పనులు రైతులకు అనుంధానం చేయాలన్నారు. జీడి పిక్కల సీజన్‌ ప్రారంభమైందని, 80 కేజీల బస్తా రూ.16 వేలు మద్దతు ధర కల్పించి ఆర్‌బికెల ద్వారా కొనుగోలు చేయాలని కోరారు. పదేళ్లుగా ఇరిగేషన్‌ కాలువలు, మదుములు మరమ్మతులకు నిధులు మంజూరు చేసి పనులు చేపట్టాలని కోరారు. చెరువులు ఆక్రమణలకు గురికావడంతో పూర్తిస్థాయిలో పంట భూములకు సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వంశధార, బాహుదా నదుల అనుసంధీకరించి ఉద్దానం ప్రాంతానికి నీరు విడిచిపెట్టాలన్నారు. అనంతరం ఆర్‌డిఒ భరత్‌ నాయక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పుచ్చ దుర్యోధన, దాసరి శ్రీరాములు, తామాడ త్రిలోచన, నల్ల అడ్డి మాస్టర్‌, మద్దెల ధర్మారావు, కారి పురుషోత్తం పాల్గొన్నారు.

➡️