నేటి నుంచి యుటిఎఫ్‌ పోరుబాట

ఉపాధ్యాయులు, ఉద్యోగుల ఆర్థిక సంబంధ

మాట్లాడుతున్న కిషోర్‌ కుమార్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ఉపాధ్యాయులు, ఉద్యోగుల ఆర్థిక సంబంధ బకాయిలు విడుదల చేయాలని, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ నేటి నుంచి పలురూపాల్లో ఆందోళనా కార్యక్రమాలు చేపడుతున్నట్లు యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.కిషోర్‌ కుమార్‌ తెలిపారు. నగరంలోని యుటిఎఫ్‌ జిల్లా కార్యాలయంలో ఆ సంఘ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని జిల్లా అధ్యక్షులు ఎల్‌.బాబూరావు అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి వస్తే ప్రతి నెలా ఒకటో తేదీన జీతం, మెరుగైన పిఆర్‌సి, సకాలంలో డిఎలు చెల్లిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి హామీనిచ్చారని గుర్తుచేశారు. అధికారంలోకొచ్చాక ఉద్యోగులు, ఉపాధ్యాయులపై భిన్నమైన వైఖరిని అవలంభిస్తూ ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళనబాట పడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 27న తాలూకా కేంద్రాల్లో ఆరు గంటల ధర్నా, జనవరి మూడో తేదీన జిల్లా కేంద్రంలో 12 గంటల ధర్నా, 9, 10వ తేదీల్లో విజయవాడలో 36 గంటల ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. వీటిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.శ్రీరామ్మూర్తి, నాయకులు కె.వైకుంఠరావు, కె.దాలయ్య, బి.ధనలక్ష్మి, ఎం.వాగ్దేవి, పి.అప్పారావు, వై.ఉమాశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️