పార్టీ మారారని పెన్షన్లు తీసేశారు

పలాస నియోజకవర్గం

వినతులు స్వీకరిస్తున్న జెసి నవీన్‌

  • ‘స్పందన’లో టిడిపి నేత గౌతు శిరీష ఫిర్యాదు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

పలాస నియోజకవర్గం పరిధిలోని సరియాపల్లిలో ఇటీవల అధికార పార్టీని వీడి టిడిపిలో చేరారన్న అక్కసుతో పెన్షన్లు తొలగించారని ఆసరా సాయాన్ని తొలగించారని టిడిపి రాష్ట్ర కార్యదర్శి గౌతు శిరీష జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌కు ఫిర్యాదు చేశారు. సరియాపల్లి గ్రామ సర్పంచ్‌ డి-పట్టా భూముల్లో అనధికారికంగా లేఅవుట్లు వేస్తున్నారని ఫిర్యాదు చేశారు. మహాదేవుపురం సమీపాన చెరువులో ఎటువంటి అనుమతుల్లేకుండా మట్టిని తవ్వి ఇసుక బట్టీలకు వైసిపి నాయకులు విక్రయిస్తున్నారని ఫిర్యాదు చేశారు. వీటిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు. నగరంలోని జెడ్‌పి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా పలు సమస్యలపై 216 వినతులు వచ్చాయి. వంశధార భూసేకరణలో పరిహారం చెల్లింపు సమయంలో పేరు తప్పుగా నమోదు కావడం వల్ల నేటికీ అందలేదని, న్యాయం చేయాలని వంశధార ప్రాజెక్టు నిర్వాసిత గ్రామమైన దుగ్గుపురానికి చెందిన సుందరరావు వినతిపత్రం అందజేశారు. ఎచ్చెర్లలోని సాంఘిక సంక్షేమశాఖ గురుకులంలో పనిచేస్తున్న కంటిన్‌జెన్సీ కార్మికులకు నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళా కార్మికులు వినతినిచ్చారు. భూ వివాదాలు, రీ సర్వేలో లోపాలను సరిదిద్దాలని కోరుతూ పలువురు ఫిర్యాదులు అందజేశారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం ఉండకూడదని, సత్వరమే పరిష్కరించాలని జెసి అధికారులను ఆదేశించారు. గతంలో వచ్చిన ఫిర్యాదుల పెండింగ్‌ దరఖాస్తులపై సమీక్షించారు. ప్రత్యేక ఉప కలెక్టర్‌ మహాలక్ష్మి, జెడ్‌పి సిఇఒ వెంకటేశ్వరరావు వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో డిఎంహెచ్‌ఒ బి.మీనాక్షి, వంశధార ఎస్‌ఇ డోల తిరుమలరావు, సమగ్ర శిక్ష ఎపిసి ఆర్‌.జయప్రకాష్‌, డ్వామా పీడీ చిట్టిరాజు, డిఇఒ వెంకటేశ్వరరావు, గహనిర్మాణ శాఖ పీడీ గణపతిరావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️