ప్రశాంత ఎన్నికల నిర్వహణ లక్ష్యం

ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ ప్రతిఒక్కరి లక్ష్యం కావాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ అన్నారు. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘ మార్గదర్శకాలను

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

* ఎన్నికల సంఘ మార్గదర్శకాలను పాటించాలి

*కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ ప్రతిఒక్కరి లక్ష్యం కావాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ అన్నారు. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘ మార్గదర్శకాలను సెక్టార్‌ అధికారులు తప్పక పాటించాలని స్పష్టం చేశారు. జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో సెక్టార్‌ అధికారులు, సెక్టార్‌ పోలీసు అధికారుల రెండో విడత శిక్షణా కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో సెక్టార్‌ అధికారులదే కీలకపాత్ర అని అన్నారు. ఎన్నికలకు నాలుగు నెలలు ముందుగా సెక్టార్‌ అధికారులను నియమించి, వారికి శిక్షణ ఇవ్వాలని ఎన్నికల సంఘ మార్గదర్శకాలు ఉన్నాయని తెలిపారు. రిటర్నింగ్‌ అధికారులకు సెక్టార్‌ అధికారులు అనుసంధానమై ఉంటారని చెప్పారు. ఒక్కో రిటర్నింగ్‌ అధికారి కింద 20 నుంచి 30 సెక్టార్లు ఉంటాయని, ఒక్కో సెక్టార్‌ అధికారికి 10 నుంచి 15 పోలింగ్‌ కేంద్రాల పరిధి ఉంటుందన్నారు. సెక్టార్‌ అధికారులకు ఎన్నికల సమయంలో మెజిస్టీరియల్‌ అధికారాలు ఇస్తామని తెలిపారు. సెక్టార్‌ అధికారులు తమ పరిధిలోని ప్రతి పోలింగ్‌ కేంద్రాన్నీ స్వయంగా సందర్శించి వసతులు, ఓటర్లకు అనుకూలతలను పరిశీలించాలని, సమస్యాత్మక అంశాలను నమోదు చేసుకోవాలని సూచించారు. తమ పరిధిలో సోషల్‌, కమ్యూనిటీ, పొలిటికల్‌, లా అండ్‌ ఆర్డర్‌ పరిస్థితులు ఎలా ఉన్నాయో పర్యవేక్షించాలన్నారు. బూత్‌ లెవల్‌ అధికారులు, తహశీల్దార్లు, ఎంపిడిఒలు, ఎస్‌హెచ్‌ఒలను ఒకరికి ఒకరు పరిచయం చేసుకోవాలన్నారు. గ్రామాల్లో రాజకీయ పక్షాలతో సమావేశాలు నిర్వహించి సమస్యలపై చర్చించాలన్నారు. ఎన్నికలకు ఎలక్టోరల్‌, ఇవిఎం, పోలింగ్‌ కేంద్రాలు, పోలింగ్‌ సిబ్బంది కీలకమన్నారు. ప్రతి ఎన్నికలనూ కొత్తగానే చూడాలని, ఏ దశలోనూ తప్పిదాలకు ఎటువంటి ఆస్కారం ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ, ఇవిఎంల నిర్వహణపై సెక్టార్‌ అధికారులకు అవగాహన కల్పించారు.మాస్టర్‌ ట్రైనీ జయదేవి ఎన్నికల నిర్వహణ అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ చేశారు. సెక్టార్‌ అధికారుల అనుమానాలను నివృత్తి చేశారు. అనంతరం ఇవిఎంల ద్వారా ఓటింగ్‌ విధానాన్ని వివరించారు. శిక్షణా కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్‌ పద్మావతి, జిల్లాపరిషత్‌ సిఇఒ ఆర్‌.వెంకట్రామన్‌, శ్రీకాకుళం, పలాస ఆర్‌డిఒలు సిహెచ్‌.రంగయ్య, భరత్‌ నాయక్‌, ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం నియోజకవర్గాలకు ఎన్నికల విధుల కోసం నియమితులైన సెక్టార్‌ అధికారులు, సెక్టార్‌ పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

 

➡️