మందకొడిగా ధాన్యం కొనుగోలు

ఖరీఫ్‌ సీజన్‌లో 3,51,843 ఎకరాల్లో వరి వేశారు. ఇందులో 3,50,765 ఎకరాలకు పంటల క్రాపింగ్‌ జరిగింది. 3,34,330 ఎకరాలకు

ఇప్పటివరకు 2.16 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు

కొనాల్సింది 5.40 లక్షల టన్నులు

వెంటాడుతున్న సాంకేతిక సమస్యలు

జిల్లాలో చివరి గింజ వరకు ధాన్యం కొంటాం. దళారుల ప్రమేయం లేకుండా చేస్తాం. రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. ఇవీ ప్రజాప్రతినిధులు, అధికారులు ధాన్యం కొనుగోలు ప్రారంభంలో చెప్పే మాటలు. కొనుగోలు విషయానికి వచ్చేసరికి పాత కథే పునరావృతమవుతోంది. ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా అధికారులు క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారే తప్ప పని జరగడం లేదు. డిసెంబరు మూడో వారంలోకి ప్రవేశించినా ధాన్యం కొనుగోలు జోరందుకోలేదు. జిల్లాలో నేటికీ పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు తెరుచుకోలేదు. ధాన్యం సిద్ధంగా ఉన్నా కొనుగోలు చేయకపోవడంతో రైతులు దళారులకు అమ్ముకుంటున్నారు. సాంకేతిక సమస్యలు, ధాన్యం నాణ్యంగా లేకపోవడంతో మిల్లర్లు తీసుకునేందుకు నిరాకరించడం వంటి సమస్యలతో ధాన్యం కొనుగోలు ముందుకు సాగడం లేదు.

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

ఖరీఫ్‌ సీజన్‌లో 3,51,843 ఎకరాల్లో వరి వేశారు. ఇందులో 3,50,765 ఎకరాలకు పంటల క్రాపింగ్‌ జరిగింది. 3,34,330 ఎకరాలకు ఇకెవైసి పూర్తయింది. ఈ సంవత్సరం 8.17 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. అందులో 7,87,447 మెట్రిక్‌ టన్నులు మార్కెట్‌లోకి వస్తుందని భావిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం 5.40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం వరికి సాధారణ రకానికి రూ.2,183, గ్రేడ్‌-ఎ రకానికి రూ.2,203 మద్దతు ధర ప్రకటించింది. ధాన్యం కొనుగోలుకు అధికారులు జిల్లావ్యాప్తంగా 606 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రాలను మూడు కేటగిరీలుగా విభజించారు. రెండు వేలు పైబడి ధాన్యం సేకరించే అవకాశమున్న కేంద్రాలను ఎ-కేటగిరీగా, వెయ్యి నుంచి రెండు వేల టన్నుల్లోపు కొనుగోలు చేసేవాటిని బి-కేటగిరీగా విభజించారు. వెయ్యి టన్నుల కంటే తక్కువ ధాన్యం కొనుగోలుకు అవకాశమున్న వాటిని సి-కేటగిరీగా నిర్ణయించారు.మండలాల్లో కొనుగోలు పరిస్థితి ఇలా…జిల్లాలో గ్రేడ్‌-ఎ, సాధారణ రకం ధాన్యం కలిపి మొత్తం 2.16 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. కంచిలిలో అత్యల్పంగా కేవలం 89.56 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. కవిటిలో 309.2 మెట్రిక్‌ టన్నులు, ఇచ్ఛాపురంలో 458.04 మెట్రిక్‌ టన్నులు, పొందూరులో 803.84 టన్నుల ధాన్యాన్ని కొన్నారు. లావేరులో 980.96 మెట్రిక్‌ టన్నులు, ఎచ్చెర్లలో 1552.28 టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. జిల్లాలో అత్యధికంగా జలుమూరులో 22,759 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఆ తర్వాత స్థానంలో సారవకోట ఉంది. సారవకోటలో 17,572 టన్నులను కొన్నారు. నరసన్నపేటలో 15,154 టన్నులను కొనుగోలు చేశారు. నందిగాంలో 13,409 మెట్రిక్‌ టన్నులు, కొత్తూరులో 13,024 మెట్రిక్‌ టన్నులు, కోటబొమ్మాళిలో 12,405 మెట్రిక్‌ టన్నులను కొన్నారు. ధాన్యం కొనుగోలుకు లక్ష్యం పెట్టుకోలేదంటూ అధికారులు చెప్తున్నా, కేంద్రాలకు నిర్దేశించిన మేరకే కొంటున్నారు. మిల్లులకు ఇచ్చిన ధాన్యం మేరకు మిల్లర్ల నుంచి బ్యాంకు గ్యారంటీలు తీసుకుంటున్నారు. బ్యాంకు గ్యారంటీలు పూర్తి కావడంతో ఆర్‌బికె సిబ్బంది తర్వాత వచ్చిన వాటిని వెనక్కి పంపిస్తున్నారు.నత్తనడకన కొనుగోళ్లుధాన్యం కొనుగోలుకు అన్నిరకాల ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్నా, క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు కనిపించడం లేదు. కొనుగోలు కోసం 606 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటివరకు 533 కేంద్రాలు తెరుచుకున్నాయి. వీటి ద్వారా 2.16 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. ఇందులో గ్రేడ్‌-ఎ రకం 127.72 మెట్రిక్‌ టన్నులు కాగా, సాధారణ రకం ధాన్యం 2.15 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు కొనుగోలు చేశారు. బ్యాంకు గ్యారంటీలు, సాంకేతిక సమస్యలు వంటి కారణాలతో ధాన్యం కొనుగోలు సాఫీగా సాగడం లేదు. రైతుల నుంచి వచ్చిన ధాన్యం వివరాలను ఆర్‌బికె సిబ్బంది నమోదు చేస్తున్న సందర్భంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని మిల్లులకు భారీగా లోడ్లు వెళ్తుంటే మరికొన్నింటికి స్వల్ప పరిమాణంలో ధాన్యం లోడ్లు వెళ్తున్నాయి.

➡️